మాతో పెట్టుకుంటావా? రైతుకు రూ.65వేల బిల్ వేసిన విద్యుత్ సిబ్బంది

Update: 2022-08-02 16:00 GMT
రాష్ట్రంలో విద్యుత్ సిబ్బంది దూకుడుకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. ఇష్టానుసారంగా బిల్లుల మోత మోగిస్తున్నారని.. చీటికి మాటికి బిల్లులు వేస్తున్నారని ఒక ప్రధాన ఆరోపణ ఉంది. తాజాగా ఓ సామాన్య రైతు ఇంటికి ఏకంగా నెలకు రూ.65 వేల విద్యుత్ బిల్లు వేసి అతడికి షాకిచ్చారు.

వికారాబాద్ మండల పరిధిలోని సాండేపూర్ మైసమ్మ చెరువుతండాకు చెందిన రెడ్యానాయక్ వ్యవసాయ కూలీ. రోజూ కూలీ పనులు చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన ఇంటికి సర్వీస్ నంబర్ 58లో విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. ప్రతీనెల విద్యుత్ బిల్లు సక్రమంగానే చెల్లిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో గత సంవత్సరం లైన్ మెన్.. రెడ్యానాయక్ తో మీటర్ బాగోలేదని.. వేరే మీటర్ బిగించాలని చెప్పడంతో రైతు.. లైన్ మెన్ కు రూ.2వేలు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి సంవత్సరం దాటినా కొత్త మీటర్ బిగించకపోవడంతో రెడ్యానాయక్ గత నెల జూన్ లో లైన్ మెన్ ను నిలదీశాడు.

దీంతో సీరియస్ అయిన లైన్ మెన్ వచ్చే నెల చూడు నీ కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అని రైతుకు చెప్పి బెదిరించి వెళ్లిపోయాడు. అనంతరం జూలై నెలకు సంబంధించి ఏకంగా రూ.65240 బిల్లు వేశాడు. దీంతో ఏమీ చేయాలో తోచక రైతు విద్యుత్ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. వాళ్లు రెడ్యానాయక్ ను పట్టించుకోలేదు.

ప్రతీ నెల రూ.100లోపు వచ్చే విద్యుత్ బిల్లు.. ఏకంగా రూ.65 వేలు వస్తే ఎలా అని రైతు వాపోతున్నాడు. దాన్ని నిర్ణీత గడువులోపు చెల్లిస్తానని.. కానీ లైన్ మెన్ కావాలనే బిల్లు ఎక్కువ వచ్చేలా చేశాడని ఆవేదన చెందాడు.

ఈ విషయంపై విద్యుత్ ఏఈ ఖాను మీడియా వివరణ కోరగా.. 2014 నుంచి రైతు మినిమం బిల్లును ప్రతీనెల కడుతున్నాడని.. అందుకే రీడింగ్ జామ్ అయ్యి అంత బిల్లు వచ్చిందన్నారు. రైతుకు బిల్లులో రూ.33వేలు తగ్గించామని చెప్పారు. అంతేకానీ అంత బిల్లు వఎంత వచ్చింది? నైతికమా? అక్రమమా? అన్నది మాత్రం చెప్పడం లేదు.
Tags:    

Similar News