శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ... ఈసారి ఏమవుతుందో

Update: 2022-05-07 02:56 GMT
శ్రీలకంలో పరిస్దితులు చేయి దాటిపోతున్నాయి. అందుకనే అధ్యక్షుడు శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. గడచిన కొంతకాలంగా దేశంలో పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్న విషయం తెలిసిందే. శాంతిభద్రతలకు విఘాతం కలగటమే కాకుండా నిత్యావసర వస్తువులు దొరకడం లేదు, ఆర్ధికంగా దేశం దివాలా తీసింది. ప్రపంచ దేశాల నుండి తీసుకున్న అప్పును తీర్చలేమని ప్రకటించేసింది.

ఇలాంటి అనేక కారణాలతో దేశంలోని జనాలంతా అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే, ప్రధానమంత్రి మహీంద రాజపక్సేల రాజీనామాలను డిమాండ్ చేస్తున్నారు. తమ పదవులకు రాజీనామాలు చేయటానికి వీళ్ళు అంగీకరించకపోవడంతో జనాలంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

గడచిన నెలరోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నానా రచ్చ చేస్తున్నారు. దేశంలోని కార్మిక యూనియన్లన్నీ ఏకమైపోయాయి. ఇప్పటికి మూడు సార్లు అధ్యక్ష, ప్రధానమంత్రులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్ జరిగింది.

ప్రజల నిరసనలకు కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక, వివిధ రంగాల్లోని ప్రముఖులు నూరుశాతం మద్దతు పలుకుతున్నారు. రాజపక్స అసంబద్ధ నిర్ణయాలతో దేశం ఆర్ధికంగా, రాజకీయంగా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశాల నుండి దిగుమతులు ఆగిపోయాయి. దీనివల్ల నిత్యావసరాలు, పెట్రోల్, డీజల్, గ్యాస్ తదితరాలు ఆగిపోయాయి. లీటర్ పెట్రోల్ ఇపుడు శ్రీలంకలో రు. 500 పైనే ఉంది. వంట గ్యాస్ సిలిండర్ ధర రు. 5 వేల రూపాయల పైమాటే.

కేజీ పాలపొడి ప్యాకెట్ ధర 2 వేల రూపాయలుంది. ఆకాశాన్నంటిన ధరలతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. డబ్బున్న వాళ్ళు కొనుక్కుందామన్నా కూడా చాలా నిత్యావసరాలు దొరకడం లేదు. పెట్రోల్, డీజల్ అయితే దొరకటమే లేదు. ఇలాంటి సంక్షోభంలో దేశాన్ని నెట్టేసిన రాజపక్సను జనాలు రాజీనామా చేయమంటే అధ్యక్షుడేమో చేయడం లేదు.

దేశంలో నెలరోజులుగా ఎన్ని అల్లర్లు జరుగుతున్నా అధ్యక్ష, ప్రధాన మంత్రులు మాత్రం తమ పదవులకు రాజీనామాలు చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. చూస్తుంటే జనాలే వాళ్ళ భవనాలపైకి దాడులు చేసేట్లున్నారు. ఎందుకంటే ఇప్పటికి రెండు సార్లు ప్రయత్నం జరిగినా ఫెయిలైంది. తాజా ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తు జనాలు అర్ధరాత్రి నుండే రోడ్లపైకి వచ్చేశారు. మరిపుడు పరిస్ధితి ఎలాగుంటుందో చూడాలి.
Tags:    

Similar News