ఏపీ అధికారిని చంపేసిన తేనెటీగలు

Update: 2020-09-23 06:15 GMT
అవును.. ఒక ఉన్నతాధికారిని తేనెటీగలు చంపేశాయి. వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ పరిణామం విస్మయానికి గురి చేస్తోంది. ఈ మధ్యనే ప్రమోషన్ లభించిన ఆ ఉన్నతాధికారి ప్రాణాలు పోయిన వైనం అందరిని నిర్ఘాంతపోయేలా చేస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే?

ఎస్సార్బీసీ డీజీ భాను ప్రకాశ్ కు ఇటీవలే పదోన్నతి లభించింది. కొద్ది కాలం క్రితం వరకు కడప.. నెల్లూరు.. తిరుపతిలో ఏఈగా పని చేస్తున్న ఆయన.. ప్రమోషన్ మీద కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు. డీఈ హోదాలో మంగళవారం ఉదయం భానకచెర్ల నీటి సముదాయంలోని గేట్లను తనిఖీ చేసేందుకు వెళ్లారు.

గేట్ల పై భాగంలోని యంత్రాలకు మరమ్మతులు చేయించారు. ఈ శబ్దాలకు అక్కడే ఉన్న తేనె టీగలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున లేచాయి. ఈ పరిణామాన్ని అధికారులు ఊహించలేదు.అవన్నీ డీఈ భాను ప్రకాశ్ మీద దాడి చేశాయి. వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన కిందపడిపోయారు. ఓవైపు తేనెటీగల దాడి.. మరోవైపు కింద పడిన సమయంలో ముక్కులో నుంచి రక్తం వచ్చింది.

అక్కడున్న సిబ్బంది స్పందించి.. ఆయన్ను హుటాహుటిన కారులోకి చేర్చి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరే సమయానికి ఆయన మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. అప్పటివరకు తమతో కలిసి ఉన్న ఉన్నత అధికారి.. తేనెటీగల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వైనం అక్కడి వారిని తీవ్ర విషాదానికి గురి చేసింది.
Tags:    

Similar News