లేడీ ధోనీ.. రికార్డు హాఫ్ సెంచరీ.. మనమ్మాయే..
బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తరహాలో కేవలం 16 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి వచ్చింది షెఫాలీ.
భారత మహిళల క్రికెట్ కూడా ఊపందుకుంటోంది.. కొన్నేళ్ల కిందట మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విజయవంతంగా నడుస్తోంది. గత వారం నిర్వహించిన మినీ వేలంలో పలువురు అమ్మాయిలకు మంచి ధర దక్కింది. ఇక సీనియర్ మహిళల జట్టు అప్పుడప్పుడు పరాజయాలు ఎదుర్కొంటున్నా.. అది ఆస్ట్రేలియాలా లాంటి బలమైన జట్టుపైనే. మిగతా ఏ జట్లయినా భారత మహిళల ముందు దిగదుడుపే. ఇక ఈ టి20ల శకంలో అందుకుతగ్గట్లు ఆడగల మహిళలూ మన జట్టులో ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకొనేది షెఫాలీ వర్మ. ఈ హరియాణా కుర్రది బ్యాట్ పట్టిందంటే చాలు దుమ్మురేపుతుంది. ఈమెను లేడీ సెహ్వాగ్ అనొచ్చేమో..? బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తరహాలో కేవలం 16 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి వచ్చింది షెఫాలీ. కానీ, భారత జట్టులో లేడీ ధోనీ కూడా ఉందండోయ్..
చరిత్ర సృష్టించింది..
భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్. ఈమెను లేడీ ధోనీ అనొచ్చేమో..? వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ దుమ్మురేపుతుంది రిచా. తాజాగా ఈ అమ్మడు అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్ లో భారత్ తరుపున వేగవంతమైన అర్థశతకం సాధించిన బ్యాటర్ గా నిలిచింది. ప్రపంచ రికార్డును సైతం సమం చేసింది.
ఆసీస్ పరాజయాన్ని మర్చిపోయి..
ఆస్ట్రేలియాతో ఇటీవల సిరీస్ లో భారత జట్టు పరాజయం పాలైంది. కానీ, ఆ ఓటమిని మరిపించేలా రిచా తాజాగా వెస్టిండీస్ తో మ్యాచ్ లో చెలరేగి ఆడింది. ముంబై డీవై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన మూడో టీ20లో రిచా 18 బంతుల్లోనే 50 పరుగులు చేసింది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 21 బంతులు ఎదుర్కొన్న రిచా మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 54 పరుగులు చేసింది.
కాగా, రిచా కంటే ముందు సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 18 బంతుల్లో భారత్ పై (2015లో), ఫోబ్ లిచ్ ఫీల్డ్ (ఆస్ట్రేలియా) – 18 బంతుల్లో వెస్టిండీస్ పై (2023లో), నిదా దార్ (పాకిస్థాన్) – 20 బంతుల్లో సౌతాఫ్రికా పై (2019లో), అలిస్సా హీలీ (ఆస్ట్రేలియా) – 21 బంతుల్లో ఐర్లాండ్ పై (2018లో),సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – 21 బంతుల్లో ఐర్లాండ్ పై (2018లో), ఆలిస్ క్యాప్సీ (ఇంగ్లాండ్) – 21 బంతుల్లో ఐర్లాండ్ పై (2023లో) తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు.