ఇంగ్లీష్ మీడియం విద్య‌.. మోడీ దృష్టిలో జ‌గ‌న్ ప‌లుచ‌న‌వుతారా?

Update: 2021-07-30 09:25 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న అన్ని ప్ర‌భుత్వ స్కూళ్ల‌లోనూ ఇంగ్లీష్ మీడియం బోధ‌న‌.. అనే కాన్సెప్ట్ వైసీపీకి న‌చ్చినా..ఇతర పార్టీలతోపాటు.. ఒక వర్గం ప్ర‌జ‌లకు కూడా న‌చ్చ‌డం లేదు. దీంతో తెలుగు భాష‌కోసం.. వారంతా ఉద్య‌మిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ మాత్రం తాను తీసుకున్న నిర్ణ‌యం విష‌యంలో వెనక్కి త‌గ్గేది లేద‌ని చెబుతున్నారు. ఇదిలావుంటే.. జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌.. కేంద్రం వ‌ద్ద ఆయ‌న ప‌రువును త‌గ్గించే అంవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

దీనికి కార‌ణం ఏంటంటే.. కేంద్రంలోని న‌రేంద్ మోడీ ప్ర‌భుత్వం నూత‌న విద్యా విధానాన్ని(ఎన్ ఈపీ) తీసుకువచ్చింది. దీనిని బ‌ట్టి.. ప్ర‌తి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనూ, ప్రైవేటు పాఠ‌శాల‌లోనూ.. మాతృభాష‌కు, స్థానిక భాష‌కు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల జ‌రిగిన ముఖ్య‌మంత్రుల‌తో స‌మావేశంలో ప్ర‌ధాని మోడీ స్ప‌ష్టం చేశారు. మాతృభాష‌కు ప్రాధాన్యం ఇవ్వాలంటూ.. ఆయ‌న నొక్కి చెప్పారు. ఉన్నత‌స్థాయి విద్యాసంస్థ‌ల్లోనూ మాతృభాష‌కు ప్రాధాన్యం త‌ప్ప‌ద‌ని నొక్కి మ‌రీ చెప్పారు.

అంతేకాదు.. ఈ ఏడాది నుంచి కొన్ని ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో స్థానిక భాష‌లోనే బోధ‌న చేయాలంటూ.. మోడీ ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న కూడా చేశారు. మొత్తం 8 రాష్ట్రాల్లోని సుమారు 14 ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ఐదు భాష‌ల్లో విద్యా బోధ‌న ప్రారంభిస్తున్న‌ట్టు మోడీ తెలిపారు. వీటిలో తెలుగు, త‌మిళం, మ‌రాఠీ, బెంగాలీ, హిందీ వంటివి ఉన్నాయ‌న్నారు. ఈ విధానం వ‌ల్ల‌.. ఆర్థికంగా వెనుక బ‌డిన వ‌ర్గాల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌ధాని వివ‌రించారు.

అదేస‌మ‌యంలో సాంకేతిక విద్య‌ను 11 ప్రాంతీయ భాష‌ల్లోకి అనువ‌దించేందుకు ప్ర‌త్యేక ప‌రిక‌రాన్ని అభివృద్ధి చేసిన‌ట్టు తెలిపారు. మాతృభాష ఆధారిత విద్య‌ను పాఠశాల స్థాయి నుంచి అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని.. ఇది జాతీయ విద్యావిధానంలో ఒక భాగ‌మ‌ని.. మోడీ చెప్పారు. దీనికి సంబంధించి టీచ‌ర్లు, ప్రిన్సిపాళ్లు, విధాన నిర్ణాయ‌క‌దారులు దేశ వ్యాప్తంగా చాలా శ్ర‌మించారని మోడీ వెల్ల‌డించారు.

అయితే.. మోడీ నిర్ణ‌యం ఇత‌ర రాష్ట్రాల‌కు ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ.. జ‌గ‌న్ స‌ర్కారును మాత్రం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా విద్యార్థి రాణించాల‌నే సంక‌ల్పంతో తాను.. ఇంగ్లీష్ మీడియం విద్య‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టు జ‌గ‌న్ చెబుతున్నారు. అంతేకాదు.. అండ‌ర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లోనూ.. ఇంగ్లీష్ ప్ర‌వేశ పెడ‌తాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో అటు కేంద్రంలోని మోడీ స‌ర్కారు కింద నుంచి పై వ‌ర‌కు మాతృభాష‌కు ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్ప‌డం.. జ‌గ‌న్‌కు మింగుడుప‌డ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.




Tags:    

Similar News