స్వర్ణా ప్యాలెస్ ఎపిసోడ్: రూంలోకి వెళ్లారా? రూం కోసం వెళ్లారా?

Update: 2020-11-03 05:30 GMT
దుబ్బాక ఉప ఎన్నికలో కీలకమైన పోలింగ్ కు కొన్ని గంటల ముందు నెలకొన్న రాజకీయ వేడి మరోస్థాయికి చేరుకునే పరిణామం సిద్ధిపేటలో చోటుచేసుకుంది. సిద్ధిపేటలోని స్వర్ణా ప్యాలెస్ లో బస చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి.. మాజీ ఎమ్మెల్యే వీరేశంలపై ముప్ఫైకి పైగా బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి కౌంటర్ గా బీజేపీ కార్యకర్తలు తమదైన వాదనను వినిపిస్తున్నారు.

ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.. సిద్దిపేట స్వర్ణా ప్యాలెస్ లో ఎందుకు ఉన్నారన్నప్రశ్నకు మంత్రి హరీశ్ రావు సమాధానమిస్తూ.. ఎన్నికల ప్రచారానికి క్రాంతి వచ్చాడని.. ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా స్థానికేతరులు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలో ఉండకూడని కారణంగా సిద్ధిపేటలోని స్వర్ణా ప్యాలెస్ లో బస చేసినట్లు చెబుతున్నారు. హరీశ్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందనే చెప్పాలి. దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన పలువురు నేతలు దుబ్బాకలో మకాం వేయటం.. పోలింగ్ కు 48 గంటల ముందు నియోజకవర్గాన్ని వదిలి పెట్ట సిద్ధిపేటలో ఉండి.. పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు.

స్వర్ణా ప్యాలెస్ లో ఉన్న ఎమ్మెల్యే క్రాంతిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయాల్సిన అవసరం ఏమిటి? అసలు వారు స్వర్ణా ప్యాలెస్ కు ఎందుకు వెళ్లారు? అన్న ప్రశ్నకు కమలనాథులు ఇస్తున్న సమాధానం.. తాను స్వర్ణా ప్యాలెస్ లో రూం కోసం వెళ్లానని.. ఆ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వర్గీయులు తమపై దాడికి పాల్పడినట్లుగా సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రూం కోసం వెళ్లిన తనపై దాడికి పాల్పడ్డారని ఆయన వాదిస్తున్నారు.

ఈ మొత్తం ఉదంతాన్ని చూసినప్పుడు.. అత్యుత్సాహంతో పాటు.. పోలింగ్ కు సంబంధించిన ఒత్తిడి తాజా పరిణామాలకు కారణమని చెబుతున్నారు. రూం కోసం స్వర్ణా ప్యాలెస్ కు వెళితే.. సదరు నేతతో పాటు 30 మంది కార్యకర్తలు వెంట ఎందుకు ఉంటారు? అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు తమను అదే పనిగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో.. తమ సత్తా కూడా చాటాలన్న అత్యుత్సాహమే తాజా దాడికి కారణమని అంటున్నారు. ఆందోల్ ఎమ్మెల్యేకు సిద్ధిపేటలో పనేమిటని బీజేపీనేతలు ప్రశ్నిస్తున్నారు కానీ.. ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నిక వేళ.. వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు హాజరు కావటం.. తమ పార్టీ లైన్ కు తగ్గట్లు ప్రచారం చేయటం మామూలే. ఇదంతా చూసినప్పుడు సిద్ధిపేట స్వర్ణా ప్యాలెస్ ఉదంతంలో బీజేపీ కిందిస్థాయి నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News