ట్రావెన్ కోర్ మాట‌!.. ఆ మ‌హిళ‌లు అలా చేయ‌రు!

Update: 2017-10-15 05:01 GMT
ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అయ్య‌ప్ప దేవ‌స్థానం కేర‌ళ‌లోని శ‌బ‌రిమ‌ల గ‌త కొన్నాళ్లుగా వివాదాల సుడిగుండాల చుట్టూ తిరుగుతోంది! దేశ‌వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది ఈ ఆల‌య విశేషాల‌ను తెలుసుకునేందుకు పోటెత్తుంటారు. కార్తీక మాసం వ‌చ్చిందంటే చాలు.. అయ్య‌ప్ప మాల‌ ధ‌రించిన భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో శ‌మ‌రిమ‌ల చేరుకుని హ‌రిహ‌ర సుతిని సేవ‌లో పునీతుల‌వుతారు. అయితే, ఈ ఆల‌యంలోకి వెళ్లేందుకు, స్వామిని ద‌ర్శించేందుకు కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు ఉండ‌డంతో వాటిపై గ‌త కొన్నాళ్లుగా వివాదాలు న‌లుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మ‌హిళ‌ల విష‌యంలో ఈ ఆల‌యంలో నిబంధ‌న‌లు చాలా క‌ఠినంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

రుతుస్రావం తీర‌ని మ‌హిళ‌ల‌కు ఈ ఆల‌యంలో ప్ర‌వేశం లేక‌పోవ‌డం ప్ర‌ధాన నిబంధ‌న. దీనిపై కొన్నాళ్లుగా కొన్ని మ‌హిళా సంఘాలు ఆందోళ‌న చేస్తున్నాయి. మేమేం నేరం చేసుకున్నాం? శ‌రీరంలో వ‌చ్చే మార్పుల‌ను అడ్డుపెట్టి మాకు ఆల‌య ప్ర‌వేశం లేకుండా నిషేధం అమ‌లు చ‌స్తారా? అంటూ వారు నిల‌దీస్తున్నారు. అయితే, ఈ ఆల‌య బాధ్య‌త‌లు చూస్తున్న కేర‌ళ‌లోని ట్రావెన్ కోర్ దేవ‌స్థానం మాత్రం ఈ విష‌యంలో చాలా క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తోంది. మీరేం అనుకున్నా.. ఏం చేసినా.. రుతుస్రావం తీర‌ని మ‌హిళ‌ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ అనుమ‌తించేది లేద‌ని చెప్పుకొస్తోంది. దీంతో ఆ మ‌హిళా సంఘాల‌కు తోడు సామాజిక ఉద్య‌మ కారులు, హేతువాదులు ఈ విష‌యాన్ని న్యాయ స‌మ‌స్య‌గా మార్చేశారు. ప్ర‌స్తుతం ఈకేసు దేశ అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టు ప‌రిధిలోకి చేరింది.

శబరిమల ఆలయంలోకి 10-50 ఏళ్ల మహిళల ప్రవేశాన్ని నిషేధించడం సమర్థనీయమా? కాదా? అన్న అంశాన్ని తేల్చే బాధ్యతను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్ర‌స్తుతం దీనిపై అధ్య‌య‌నం జ‌రుగుతోంది. మ‌రికొన్ని రోజుల్లోనే దీనిపై తీర్పు వెలువ‌డనుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోప‌క్క మ‌రో వారంలో కార్తీక మాసం ప్రారంభం కానుండ‌డం, శ‌బ‌రిమ‌ల ఆల‌య ద్వారాలు తెరుచుకోనుండ‌డంతో మ‌రోసారి ఈ వివాదం తెర‌మీద‌కి వ‌చ్చి ప్రాధాన్యం సంత‌రించుకుంది. దీంతో ట్రావెన్ కోర్ దేవ‌స్థానం బోర్డు దీనిపై స్పందించింది. బోర్డు అధ్య‌క్షుడు  గోపాలకృష్ణన్ ఈ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు తొలగించినప్పటికీ.. సంప్రదాయ కుటుంబంలో జన్మించిన మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఈ విష‌యంలో సుప్రీ కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా.. తమ వైఖరికే తాము కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. రుతుక్రమంలో ఉన్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ‘శబరిమల క్షేత్రాన్ని థాయ్‌లాండ్‌గా మార్చేందుకు మేం ఒప్పుకోం. మహిళలు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారుతుంది. ఒకవేళ కోర్టు మహిళల ప్రవేశానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. స్వగౌరవం ఉండే మహిళలు ఈ ఆలయంలోకి రారు.’ అని గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు మ‌హిళా సంఘాలు, సామాజిక ఉద్య‌మ కారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. దీనికి సానుకూలంగా ప‌రిష్కారం క‌నుగొంటే బాగుంటుంద‌నేది భ‌క్తుల మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News