ఎర్ర‌బెల్లి ఇన్‌..ఆయ‌న మిత్రుడు అవుట్‌

Update: 2016-02-19 09:16 GMT
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా?గులాబీ గూటికి చేరిన ఎర్రబెల్లి దయాకర రావుకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారా? ఎర్ర‌బెల్లికి మంత్రి ప‌ద‌వి ఇచ్చే స‌మ‌యంలో ఆయ‌న మాజీ మిత్రుడిని ప‌క్క‌న‌పెట్ట‌నున్నారా....ఇవ‌న్నీఇపుడు పొలిటికల్ స‌ర్కిల్‌ లో జోరుగా జ‌రుగుతున్న టాక్స్

రాజ‌కీయవ‌ర్గాల సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో సీఎంకేసీఆర్‌ మంత్రివర్గంలో పలు మార్పులు, చేర్పులు చేపట్టనున్నారని తెలిసింది. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే గులాబీ గూటికి వ‌చ్చిన ఎర్ర‌బెల్లికి మంత్రివర్గంలో బెర్తు ఖరారైంది. ఎర్ర‌బెల్లికి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా టీడీపీలో మిగిలి ఉన్న నేతలను అసెంబ్లీ లోపల, బయటా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యూహంలా కనబడుతోంది. ఎర్ర‌బెల్లిని మంత్రిని చేయ‌డం ద్వారా చంద్ర‌బాబును కూడా మాన‌సికంగా ఇరుకున పెట్ట‌డానికి అవకాశం ఉంటుంద‌ని కేసీఆర్ అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు మంత్రివ‌ర్గ మార్పుల‌కు అనుగుణంగా సీనియర్‌ మంత్రుల్లో ఒకరిద్దరిని సీఎం కేసీఆర్‌ పక్కన పెట్టే అవకాశముందని తెలిసింది. మంత్రివర్గం నుంచి రిలీవ్‌ కాబోయే సీనియర్‌ మంత్రులెవరనే అంశంపై ప్రస్తుతం చర్చోపచర్చల్లో విన‌వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం ఆరోగ్య కారణాల రీత్యా ఒకరిని, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మరొకరిని పక్కనబెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఇందులో ఒక‌రు ఎర్ర‌బెల్లి జిల్లాకు చెందిన వ్య‌క్తి కాగా మ‌రొక‌రు తెలుగుదేశం పార్టీలో ఉన్న స‌మ‌యంలో ఎర్ర‌బెల్లితో క‌లిసి ప‌నిచేసిన నాయ‌కుడు కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా తాజాగా తెర‌మీద‌కు వ‌చ్చిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ ఇపుడు గులాబీ దండులో హాట్  టాపిక్‌ గా మారింది.
Tags:    

Similar News