అప్పుడు దెబ్బేసినోళ్లే..ఇప్పుడు పదవినిస్తున్నారే

Update: 2016-02-12 04:00 GMT
ఎర్రబెల్లి పొలిటికల్ కెరీర్ చూస్తూ అయ్యో అనిపించక మానదు. ఆరుసార్లు ప్రజాప్రతినిధిగా విజయం సాధించినా ఆయన ఇప్పటివరకూ మంత్రి పదవిని చేపట్టింది లేదు. పాతికేళ్ల కుర్రాడిలా తెలుగుదేశంలో చేరి.. దాదాపు 30 ఏళ్లుగా సైకిల్ సవారీ చేసినప్పటికీ ఆయనకు మంత్రి పదవి దక్కింది లేదు. 1994 నుంచి ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తున్నా ఆయనకు పదవులు మాత్రం అట్టే రాలేదు. నిజానికి ఒకసారి మంత్రి పదవి వచ్చే అవకాశం వచ్చినప్పటికీ అప్పట్లో ఉన్న సమీకరణాలతో ఆయనకు మంత్రి పదవి దక్కకుండా పోయింది.

ఇక.. 2004 నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండటంతో ఆయనకు మంత్రిగా పని చేసే అవకాశం లభించలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఎర్రబెల్లికి  పదవి ఇవ్వాలని భావించినా.. కేసీఆర్.. విజయరామారావులకు అవకాశం ఇవ్వాల్సి రావటంతో ఆయనకు అవకాశం లభించలేదు. దీంతో.. పెద్ద పదవులు ఏమీ చేపట్టకుండానే మూడు దశాబ్దాలుగా మామూలు నేతగా ఉండిపోవటం ఎర్రబెల్లికే సరిపోయింది. ఇవాల్టి రోజున అలా రాజకీయాల్లోకి రావటం.. ఇలా పదవులు చేజిక్కించుకోవటం సాధ్యమవుతున్న వేళ.. మంత్రి పదవి కోసం ఎర్రబెల్లి ఇంత సుదీర్ఘకాలంగా వెయిట్ చేయాల్సి రావటం కాస్తంత ఆశ్చర్యకరమైన విషయమే.

కాలం కలిసి రాకపోవటం.. కలిసి వచ్చే సమయానికి అవకాశం లేకపోవటంతో మంత్రి కాలేకపోయారు. తాజాగా టీఆర్ ఎస్ లో చేరిన నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి పక్కా అని చెబుతున్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే.. గతంలో ఏ కేసీఆర్ కారణంగా పదవి లభించలేదో.. ఇప్పడు అదే నేత పిలిచి మరీ పదవి ఇస్తానంటూ పార్టీలో చేర్చుకోవటం గమనార్హం.
Tags:    

Similar News