ఇదే.. ఎర్రమంజిల్ ప్యాలెస్ ఘన చరిత్ర

Update: 2016-10-21 06:01 GMT
కాస్త అటూ ఇటూగా 150 సంవత్సరాల పాటు (కచ్ఛితంగా చెప్పాలంటే 146 ఏళ్లు) ఠీవీగా నిలిచిన ఎర్రమంజిల్ ప్యాలెస్ త్వరలో కనుమరుగు కానుందా? అంటే అవునని చెప్పక తప్పదు. ఎందుకంటే.. ఈ పురాతన కట్టడం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ చాలానే ఆశలు పెట్టుకున్నారు మరి. ఉమ్మడి రాష్ట్రంలో ఏళ్లకు ఏళ్లు సాగిన అసెంబ్లీ భవనం.. రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయిన వెంటనే.. కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారిన కేసీఆర్ కు ఇరుకుగా.. సౌకర్యాల లేమితో  కనిపించటం గమనార్హం. ఆధునికంగా నిర్మించాలని భావిస్తున్న తెలంగాణ అసెంబ్లీ.. శాసనమండలి భవనాల కోసం పురాతన కట్టడం ఒకటి బలి కానుంది. కేసీఆర్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. చారిత్రక సాక్ష్యంగా నిలుస్తున్న ఎర్రమంజిల్ ప్యాలెస్ నామరూపాల్లేకుండా పోతుందనటంలో సందేహం లేదు.

ఇంతకీ.. ఎర్రమంజిల్ ప్యాలెస్ చరిత్ర ఏమిటి? దాని గొప్పతనం ఏమిటి? చరిత్రలో దానికున్న ప్రాధాన్యత ఏమిటన్నది చూస్తే.. అబ్బురం చెందాల్సిందే. ఎర్రమంజిల్ ప్యాలెస్ ను 1870లో నిర్మించారు. నాటి నిజాం నవాబులు రాయల్ డిన్నర్ లు.. ఇతర వినోదాల కోసం దీన్ని నిర్మించారు. సంబరాలకు.. కుటుంబపరమైన కార్యక్రమాలకు ఈ ప్యాలెస్ ను విడిదిగా వాడుకునే వారు. రాజ కుటుంబంలో జరిగే కార్యక్రమాల కోసం.. విదేశీ అతిధులు వచ్చినప్పుడు ఏర్పాటు చేసే విందుల కోసం వినియోగించేవారు.

ఇండో – యూరోపియన్ శైలిలో నిర్మించినఈ కట్టటం అత్యంత ఠీవీగా నిర్మించారు. పాలకుల నిర్లక్ష్యంతో పాతబడిపోయిన ఈ కట్టడాన్ని నిర్మించటం కోసం నాణ్యమైన కలపను విదేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయ్యాక.. ఈ భవనం రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వచ్చేసింది. మొదట్లో దీన్ని రికార్డు స్టోర్స్ గా వాడినా.. తర్వాతి కాలంలో పబ్లిక్ వర్క్స్ శాఖకు కేటాయించారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉన్న ఈ భవనాన్ని కూలగొట్టి కొత్త అసెంబ్లీని నిర్మించాలని నిర్ణయించారు. మరోవైపు.. ఇప్పుడున్న అసెంబ్లీ భవనాన్ని చూస్తే.. 1905లో టౌన్ హాల్‌ కోసం దీన్ని నిర్మించారు.
Tags:    

Similar News