కేసీఆర్ కు ఈటల ఘాటు సవాలు.. కానీ మీడియాలో ప్రాధాన్యత మిస్

Update: 2021-09-01 04:30 GMT
హుజూరాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఎంతలా నడుస్తున్నదో తెలియంది కాదు. దీనికి కారణమైన ఈటల మాటలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేం సిత్రమో కానీ.. తాజాగా అలాంటి పరిస్థితి కనిపించకపోవటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఈటల రాజేందర్ స్థాయి లాంటి లీడర్ ఘాటు విమర్శ చేసినా.. తీవ్రమైన సవాలు విసిరినా.. దానికి ప్రాధాన్యత కల్పిస్తుంటారు. ఏమైందో కానీ.. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా చేస్తున్న ఈటల రాజేందర్ మంగళవారం అనూహ్య వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు.. ఆయన మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావుకు భారీ సవాలు విసిరారు. దమ్ముంటే.. కేసీఆర్ కానీ హరీశ్ లు కానీ ఇద్దరిలో ఎవరైనా తనపై పోటీ చేయాలన్నారు. ఒకవేళ వాళ్లు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. ఒకవేళ ఓడిపోతే రాజీనామా చేస్తారా? అని సవాలు విసిరారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిస్మత్ నగర్ లో జరిగిన సభలో మాట్లాడారు.

ఎప్పుడు రాని వారు ఏదేదో మాట్లాడుతున్నారని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా ధర్మాన్ని.. న్యాయాన్ని నమ్ముకుని ముందుకు పోతానని చెప్పిన ఆయన.. బెదిరింపులు.. అహంకారం.. డబ్బులతో పరిస్థితిని మార్చలేరన్నారు. హూజురాబాద్ లో పరిస్థితిని కిందామీదా చేయాలని చూస్తున్నారని.. అది నీ జేజమ్మతరం కూడా కాదన్న ఈటల.. మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మంతో పెట్టుకున్నారని.. పతనం తప్పదని శపించారు. దీపం ఆరిపోయే ముందు ఎక్కువ వెలుతురు ఇస్తుందన్నట్లుగా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు. ఈటల బక్కపల్చని వాడు కావొచ్చు కాక.. అనేక ఉద్యమాల్లో పాల్గొన్న బిడ్డ అని.. ధర్మం కోసం.. న్యాయం కోసం దేన్నైనా త్యాగం చేసే సత్తా ఉన్నోడని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తో తనకు పద్దెనిమిదేళ్ల అనుబంధం ఉందని.. అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. ‘రాజీనామా చేయమంటేనే ముఖం మీద కొట్టి వచ్చిన. నా ముఖం అసెంబ్లీలో కనిపించవద్దనే కసితో కేసీఆర్ పని చేస్తున్నారు’ అని ఈటల విమర్శలు చేశారు.

సాధారణంగా ఇలాంటి సంచలన వ్యాఖ్యలకు మీడియాలో దక్కే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అనూహ్యంగా ఈటల తాజా వ్యాఖ్యలు పెద్ద ప్రాధాన్యత లభించకపోగా.. సింగిల్ కాలమ్.. డబుల్ కాలమ్ తరహాలో ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా కవర్ చేయటం ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ కు.. ఈటల ఇంతకు మించిన సవాలు ఇంకేం చేయగలరు? కానీ.. ఈటల వ్యాఖ్యలకు ప్రధాన మీడియాలో ప్రాధాన్యత ఎందుకు దక్కనట్లు?
Tags:    

Similar News