ఈట‌ల డెసిష‌న్ రాంగ్.. కేసీఆర్ మోడీ ఏజెంట్ః రేవంత్‌

Update: 2021-07-04 06:36 GMT
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు మొద‌లు పెట్టారు. ఇన్నాళ్లూ ద్విముఖ పోరుగా ఉన్న తెలంగాణ రాజ‌కీయాల‌ను ముక్కోణ‌పు పోటీగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ఉన్న టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూనే.. సెకండ్ ప్లేస్ త‌మ‌దే అని చెప్పుకుంటున్న బీజేపీకి సైతం చుర‌క‌లు అంటిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రేవంత్‌.

ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఏజెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఈ రెండు పార్టీల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయ‌ని ఆరోపించారు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌. అంతేకాదు.. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ బీజేపీలో చేర‌డంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాత్ర కూడా ఉంద‌ని, కాంగ్రెస్ వైపు ఈట‌ల రాజేంద‌ర్‌ మ‌ళ్ల‌కుండా చూశార‌ని అన్నారు. ఇందుకోసం అర్ధ‌రాత్రి వేళ ప్ర‌త్యేక విమానాన్ని స‌మ‌కూర్చార‌ని, కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి అదే విమానంలో వ‌చ్చార‌ని, ఈ ఏర్పాటు ముఖ్య‌మంత్రి కేసీఆరే చేశార‌ని ఆరోపించారు. త‌ద్వారా.. టీఆర్ఎస్ - బీజేపీ రెండూ ఒక‌టే అని చెప్పేందుకు ప్ర‌య‌త్నించారు ప్ర‌తిప‌క్ష నేత‌ రేవంత్ రెడ్డి.

ఇక‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ రాష్ట్రాల మ‌ధ్య సాగుతున్న నీటి పంచాయితీ అంతా వ‌ట్టి డ్రామా అని ఆరోపించారు. వైఎస్సార్ ను నీటి దొంగ అన్నా కూడా జ‌గ‌న్‌, విజ‌య‌ల‌క్ష్మి ప‌ట్టించుకోలేద‌ని.. తెలంగాణ‌లో ఉన్న ఏపీ జ‌నాల‌ను ఇబ్బంది పెడ‌తార‌నే మౌనంగా ఉన్నామ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం ఫ‌క్తు రాజ‌కీయ వ్యాఖ్యానంగా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ‌లోని ఏపీవాసుల గురించి జ‌గ‌న్ జాలిచూపాల్సిన అవ‌స‌రం లేద‌ని, రాజ్యాంగ‌మే ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని, నీళ్ల గురించి చూసుకో అంటూ జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక బూట‌క‌పు లౌకిక వాది అన్న రేవంత్‌.. కేవ‌లం ఓట్ల కోస‌మే మైనారిటీల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు న‌టిస్తున్నార‌ని ఆరోపించారు. ఒక ముస్లింకు హోం మంత్రి ప‌ద‌వి ఇచ్చి, మొత్తం ముస్లిం స‌మాజానికే మేలు చేస్తున్న‌ట్టు కేసీఆర్ ఫీల‌వుతున్నార‌ని ఆరోపించారు. టీఆర్ఎస్ - బీజేపీ మ‌ధ్య ఉన్న అనుబంధాన్ని ముస్లింలు గుర్తించాల‌ని కోరారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ.. అక్క‌డ ఈట‌ల బ‌ల‌మే త‌ప్ప‌, బీజేపీకి ఏమీ లేద‌న్నారు. దుబ్బాక‌లోనూ ర‌ఘునంద‌న్ రావును చూసే ఓట్లు ప‌డ్డాయ‌ని చెప్పారు. అక్క‌డ గెలిచేందుకు కేసీఆర్‌, ఈట‌ల డ‌బ్బు సంచుల‌తో వ‌స్తున్నార‌ని చెప్పిన విప‌క్ష నేత రేవంత్ రెడ్డి.. తాము మాత్రం వేలాది మంది కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి యుద్ధంలోకి దిగ‌బోతున్న‌ట్టు చెప్పారు. ఈట‌ల బీజేపీలో చేర‌డంపైనా స్పందించిన రేవంత్‌.. ఆయ‌న‌ది రాంగ్ డెసిష‌న్ అన్నారు. కాంగ్రెస్ లో చేరి ఉంటే.. స్వేచ్ఛ‌గా ప్ర‌భుత్వంపై దాడిచేసే ఛాన్స్ ఉండేద‌ని, బీజేపీలో ఆ అవ‌కాశం లేద‌న్నారు. టీఆర్ఎస్ పై యుద్ధం ప్ర‌క‌టించి, బీజేపీలోకి వెళ్లిన నాగం జ‌నార్ద‌న్ రెడ్డి వంటివారి ప‌రిస్థితి ఏమైందో తెలిసిందేన‌న్నారు. ఫైన‌ల్ గా.. ఈ స‌ర్కారు 2023 వ‌ర‌కు మ‌నుగ‌డ సాగించ‌లేద‌ని, మ‌ధ్య‌లోనే ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని జోస్యం చెప్పారు.
Tags:    

Similar News