ఏపీకి పోటీ వస్తున్న తెలంగాణ సర్కారు

Update: 2015-04-23 04:12 GMT

రాష్ర్ట ఆర్థికమంత్రి పదవిలో ఉండటం అంటే దాదాపు ముఖ్యమంత్రి తలనొప్పులు అన్ని భరించినట్లే. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇచ్చే హామీలన్నింటికీ బడ్జెట్ సర్దుబాటు చేయాలి, ప్రజలు, పార్టీ నేతల అవసరాలు తీర్చే విధంగా వ్యవహరించాలి. దీంతో పాటు వచ్చే నిధులు ఎన్నీ..అవుతున్న వ్యయం ఎంత అనేది బేరీజు వేస్తూ ఉండాలి. ఈ విధంగా కత్తిమీద సామే. అయితే పాలన అనుభవం లేనప్పటికీ తెలంగాణ రాష్ర్ట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాస్త పరవాలేదు అన్నట్లుగానే ఈ బాధ్యతలను నెరవేర్చుకుంటు వస్తున్నారు. తన విధుల నిర్వహణకు ఉపయోగపడే ఏ అవకాశాన్ని ఆయన వదులుకోవడం లేదు. 

ఢిల్లీలో జరిగిన అన్నిరాష్ర్టాల ఆర్థికమంత్రుల సమావేశంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరారు. పెట్రోల్, పొగాకు ఉత్పత్తులను జీఎస్టీ పన్ను నుంచి మినహాయించాలన్నారు. వరి లెవీపైన కేంద్రం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. పంట నష్టం జరిగిన వారికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. ఎప్పుడు లేనంతగా తెలంగాణ వచ్చిన తరువాత రైతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినమని రాజేందర్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో తమను ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని చెప్పారు. 

అనంతరం కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ తో భేటీ అయి రేషన్ బియ్యం కోటా పెంపు సహా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో దారిద్ర్య రేఖకు దిగువన (బీపీఎల్) 1.1 కోట్లుగా ఉన్న కుటుంబాలను 2.3 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ హాస్టళ్లకు, ప్రజలకు రేషన్‌ బియ్యం కోటాను పెంచాలని రెండుసార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క కిలో బియ్యం కూడా పెంచకపోవడం బాధాకరమని ఈటెల అన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఆరు కిలోల బియ్యం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆ భారాన్ని కూడా కేంద్రం కొంత భరించాలన్నారు. 68వేల 500 మెట్రిక్ టన్నుల బియ్యం అధికంగా సరఫరా చేయాలని ఈటెల కేంద్రాన్ని కోరారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలో ఎక్కని గడపా లేదు..కలవని నాయకుడు లేడు అన్నట్లుగా ప్రయత్నం చేస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆ రాష్ర్టానికి లక్షా తొంభై కొర్రీలతో కేంద్రం దాటవేస్తోంది. మరి తెలంగాణ విషయంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News