మంత్రి పదవి ప్రజల భిక్షే.. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలు

Update: 2020-02-25 07:30 GMT
తెలంగాణలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కేసీఆర్ వెన్నంటే తొలి నుంచి నడిచిన వ్యక్తి ఈటల రాజేందర్. అయితే తరచూ ఆయన భావోద్వేగాలకు లోనవుతున్నారు. గతంలో ఉద్వేగానికి గురవుతూ ఏకంగా పార్టీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేయకున్నా.. కానీ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. తనను పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులైనా తనకు మంత్రి పదవి రావడానికి కారణం మాత్రం ప్రజలే అని స్పష్టం చేశారు.

కరీంనగర్ లోని తన నియోజకవర్గం హుజూరాబాద్ లో సోమవారం పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తనకు మంత్రి పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంత్రి అమ్మానాన్న ఇవ్వలేదని, హుజూరాబాద్ ప్రజలు ఓట్లు వేస్తే వచ్చిందని చెప్పారు. తన పదవికి ప్రజలే హక్కుదారులని, ఏ పదవులున్నా ప్రజల అవసరాలు తీర్చడానికే ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో గడిపిన విపత్కర పరిస్థితులు గుర్తుచేసుకున్నారు. సమైక్య పాలనలో రూ.20 లక్షలు కావాలంటే ఇబ్బంది పడ్డామని తెలిపారు. ఆ సమయంలో ఎలాంటి పని చేయకపోయినా తనకు ఈ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని గుర్తుచేసుకున్నారు. అందుకే ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవాలనే తపన తనలో ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. 2014లో ఆర్థిక మంత్రిగా కావడంతో తన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తానున్నంతవరకు ఎవరికీ అన్యాయం చేయనని, ఎవరిపై వివక్ష చూపనని, ఏ పని అడిగినా చేసి పెట్టే బాధ్యత తనదని ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు భరోసా ఇచ్చారు.

అయితే మరోసారి టీఆర్ఎస్ అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు మాదిరిగా ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఇటీవల పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యం తగ్గుతోందని తెలుస్తోంది. అందుకే తనను ఎవరేం చేయలేరని, ప్రజలే తన బాసులని, పార్టీ అధిష్టానం కాదని చెప్పకనే చెబుతున్నారు.
Tags:    

Similar News