ఈటలను డ్యామేజ్ చేస్తున్న విషప్రచారం

Update: 2021-07-31 07:33 GMT
హూజూరాబాద్ లో ఉప ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రానే లేదు. అభ్యర్థుల ప్రకటన ఇంకా లేనే లేదు. అప్పుడే రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ఊరువాడా తిరిగేస్తున్నారు. గెలుపుకోసం చమటోడుస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ‘దళితబంధు’ అనే అస్త్రాన్ని సంధించి ఈటలను ఓడించేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది. అధికార పార్టీ నేతల దూకుడుతో నియోజకవర్గంలో ఆగమాగం పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో ఇక్కడ నుంచి గెలిచి.. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా అదే రేంజ్ లో ప్రచారం ప్రారంభించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అందరికంటే ముందే ఈటల రాజేందర్ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.నియోజకవర్గంలో ‘ప్రజాదీవెన’ పాదయాత్రను చేపట్టారు. ఈ క్రమంలోనే ఊరువాడ పొలాల వెంబడి తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఈటల కాళ్లకు పొక్కులు, జ్వరం రావడంతో పాదయాత్రలో  ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల నుంచి మధ్యాహ్న భోజన విరామం సమయంలో ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం రెండు గ్రామాల్లో ఈటల సతీమణీ జమున తాజాగా పాదయాత్ర చేపట్టారు. ఈటలకు బదులుగా ఆమె పాదయాత్ర చేపట్టారు.ఈటల కూడా రెండు రోజుల్లో జాయిన్ కానున్నారు.

ఈటల పాదయాత్రతో ప్రజలకు కనెక్ట్ అవుతుండగా.. అధికార పార్టీ పథకాలతో ప్రజలకు వలవేస్తోంది. దీంతో అక్కడ రాజకీయం రంజుగా సాగుతోంది. అయితే ఎంతగా ప్రయత్నిస్తున్నా ఈటలను దెబ్బతీసే ప్లాన్లు బోలెడు హుజూరాబాద్ లో సాగుతున్నాయట.. ముఖ్యంగా ఈటల రాజేందర్ పాదయాత్ర టార్గెట్ గా కొందరు సోషల్ మీడియాను అడ్డుగా చేసుకొని ఈటలపై తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నట్టు ఆయన భావిస్తున్నాడట.. ఈటలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు ఆయన కుటుంబంపై బురదజల్లి వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారట..

ఈటల రాజీనామా చేసిన మొదట్లోనే ఒక లేఖ సంచలనం సృష్టించింది. ‘తాను తప్పు చేశానని.. క్షమించాలని కేసీఆర్ కు రాసినట్టుగా  ఈటల పేరిట ఓ లేఖను ’ వైరల్ చేశారు. నిమిషాల వ్యవధిలో ఈ లేఖ వేలాది మందికి చేరడం.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడం వంటివి తెలిసిందే.. దీంతో వెంటనే స్పందించిన ఈటల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇక ఇక్కడితో ఈటల ఎపిసోడ్ ఆగలేదు. అనంతరం ఈటల బావమరిది దళఇతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను విస్తృతంగా వైరల్ చేశారు. ఇది మరింత వివాదంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఈ స్క్రీన్ షాట్లు మరింతగా వైరల్ చేశారు. దీంతో ఈటల అభాసుపాలయ్యారు. ఈటల కేంద్రంగా విమర్శలు, వివాదాలు పెరిగిపోయాయి. వెంటనే కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు.. మాజీ మంత్రి ఈటల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు.ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఈటల సతీమణి జమున తీవ్ర విమర్శలు సంధించారు.

ఇప్పటికీ కూడా ఈటల బావమరిది పేరిట బయటకొచ్చిన స్క్రీన్ షాట్లు ఎవరివి..? ఎవరు చాట్ చేశారు? ఎవరి పేరు మీద ప్రచారం చేశారన్నది మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఎన్నికలకు చాలా రోజుల సమయం ఉన్నప్పుడే ఈటల అనుచరులు గడియారాలు పంచుతున్నారని.. వాచీలు అందిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఇదే విషయాలపై అధికార పార్టీ మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే ఎప్పుడో ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు హంగామా చేస్తున్నారని నియోజకవర్గంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు కనీస ప్రశాంతత ఉండొద్దా? అని ప్రశ్నిస్తున్నారు. ఈటల కేంద్రంగా సాగుతున్న ఈ వ్యతిరేక ప్రచారానికి ముగింపు ఎప్పుడు పడుతుందనేది తెలియకుండా ఉంది..
Tags:    

Similar News