దద్దరిల్లిన బెంగుళూరు..కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు

Update: 2020-11-10 17:31 GMT
బెంగుళూరు నగరం మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. ఏమి జరిగిందో తెలీయకపోవటంతో అయోమయంలో జనాలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ముందు పేలుళ్ళు సంభవించిన తర్వాత నల్లని దట్టమైన పొగలు బయటకు రావటంతో చుట్టు పక్కలున్న జనాలంతా ఒకటే పరుగు. ఇంతకీ జరిగిందేమిటంటే బెంగుళూరు-మైసూరు రోడ్డులోని హోస గడ్డదహళ్ళి అనే ప్రాంతంలోని బాపూజీనగర్ లో ఓ కెమికల్ ఫ్యాక్టరీ ఉంది.

జనావాసాల మధ్యలో ఉన్న ఆ ఫ్యాక్టరీలో నుండి మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పేలుళ్ళు వినిపించాయి. దాంతో తమ ప్రాంతంలో బాంబులు పేలుతున్నాయంటూ జనాలంతా ముందు భయపడిపోయారు. అసలు పేలుళ్ళు ఎక్కడి నుండి వచ్చాయో ? ఎవరు బాంబులు వేస్తున్నారో కూడా జనాలకు అర్ధం కాలేదు. అయితే కొంతసేపటి తర్వాత ఫ్యాక్టరీలో నుండి నల్లటి దట్టమైన పొగలు రావటం మొదలైంది.

ఎప్పుడైతే పొగలను జనాలు చూశారో అప్పుడు అందరికీ అర్ధమైంది పేలుళ్ళు కూడా ఫ్యాక్టరీలోనే జరిగాయని. పేలుళ్ళు వినగానే స్ధానికులు పోలీసులకు ఫోన్ చేశారు. దాంతో పోలీసులు అదే సమయంలో అంబులెన్సుల్లో వైద్య సిబ్బంది కూడా వచ్చారు. నల్లటి పొగ కారణంగా స్ధానికులందరినీ పోలీసులు అందరినీ తమ ఇళ్ళ నుండి ఖాళీ చేయిస్తున్నారు. అయితే తర్వాత నిపుణులు వచ్చి పొగ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని నిర్ధారించటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే పేలుళ్ళు ఎలా జరిగాయనే విషయాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.

పేలుళ్ళ ధాటికి ఫ్యాక్టరీ గోడలన్నీ బద్దలైపోయాయి. అలాగే ఫ్యాక్టరీ ఆవరణలోనే నిలిపి ఉంచిన వాహనాలు కూడా ధ్వంసం అయిపోయాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం ఏమీ లేకపోయినా ఆస్తినష్టం మాత్రం భారీగానే ఉండవచ్చని ప్రాధమిక అంచనా వేశారు.
Tags:    

Similar News