ఏటీఎంలలో రూ.500 నోటుకుఆశ పడ్డారా..?

Update: 2017-01-06 08:40 GMT
పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత నుంచి ఏటీఎంలు సరిగా పని చేయని పరిస్థితి. నవంబరు 8 నుంచి డిసెంబరు 31 వరకూ ఏటీఎంలకున్న ‘‘ఎనీ టైం మనీ’’ కాస్తా ‘‘ఎనీ టైం మూతే’’ అన్నట్లుగా మారిపోయాయి. దీంతో.. ప్రజలు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. ఏటీఎంలలో నగదు పెట్టినట్లు ప్రకటనలు చేసినా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం.. పది ఏటీఎంలలో రెండు.. మూడు ఏటీఎంలు మాత్రమే పని చేశాయి. దీంతో.. పని చేసే ఏటీఎంల వద్ద క్యూలైన్లు భారీగా ఉండేవి.

జనవరి ఒకటి తర్వాత పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చిందనే చెప్పాలి. గతంలో మాదిరి చాంతాండంత పొడవున ఏటీఎంలలో క్యూలు లేకున్నా.. ఎంతోకొంత రద్దీ మాత్రం కనిపిస్తోంది. అయితే.. గతంలో మాదిరి కాకుండా రోజుకు రూ.4500 వరకూ విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించటం కొంతలో కొంత ఊరటగా చెప్పొచ్చు. అయితే.. ఏటీఎంలలో డబ్బులు తీసుకునేందుకు వెళుతున్న వారు రూ.2వేల నోటు రాకుండా ఉండేందుకు వీలుగా రూ.1500 మొత్తాన్ని నమోదు చేస్తున్నారు. అంటే.. ఒక రోజుకు తమకున్న రూ.4500 లిమిట్ మొత్తాన్ని తీసుకునేందుకు రూ.1500చొప్పున మూడుసార్లు ఏటీఎంల నుంచి డ్రా చేస్తున్నారు.

ఇలా చేయటం ద్వారా మొత్తం రూ.500నోట్లను తీసుకుంటున్నామన్న సంతోషంతో ఊగిపోతున్నవారికి ఛార్జీల మోత వాయించేస్తోంది. ఎందుకంటే.. మెట్రో నగరాల్లో.. నగరాల్లో ఏటీఎం వాడకం మీద పరిమితులు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఒకేసారి రూ.40 వేలు సైతం డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కొన్నిచోట్ల మాత్రం రూ.25వేలు.. అంతకంటే తక్కువ మొత్తం వచ్చేది. దీంతో.. నెలలో తమకు అవసరమైన మొత్తాన్ని పరిమితి లోపే వినియోగించుకునే వారు. ఒకట్రెండు సార్లు ఎక్కువగా వినియోగించినా పడే భారం కాస్త తక్కువగానే ఉండేది.

కానీ.. ఇప్పుడు పరిస్థితి మొత్తంగా మారిపోయింది. రూ.2వేల నోటు తీసుకుంటే దాన్ని మార్చుకోవటానికి కిందామీదా పడాల్సి రావటంతో.. వీలైనంతవరకూ ఎటీఎంల నుంచి రూ.500 నోట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. రూ500 నోట్లు రావటం కోసం రూ.1500 మొత్తాన్ని నమోదుచేసి విత్ డ్రా చేస్తున్నారు. దీని వల్ల కలుగుతున్న ఇబ్బంది ఏమిటంటే.. కోరుకున్నట్లుగా రూ.500 నోట్లు వస్తున్నా.. పలు దఫాలు ఏటీఎంలను వినియోగించుకోవటం కారణంగా..అదనపు లావాదేవీల కోసం విధించే చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది.. ఏటీఎం వాడే వారికి భారంగా మారింది. సో.. చిల్లర నోట్లు కావాలంటే.. అందుకు తగ్గట్లే ఎంతోకొంత భారానికి సిద్ధం కావాల్సిందేనన్నట్లుగా పరిస్థితి మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News