యాపిల్ ఐ ఫోన్ X కొన‌చ్చా? కొన‌కూడ‌దా?

Update: 2017-11-04 01:30 GMT
యాపిల్ ఐ ఫోన్ ప్రపంచంలో మొబైల్స్ ప్రియులకు అత్యంత ఇష్టమైన బ్రాండ్. ఈ ఫోన్ ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఆపిల్ ఐఫోన్ లు మార్కెట్ లో విడుద‌లవ‌గానే  హాట్‌కేకుల్లా అమ్ముడ‌వుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకే ప్రీ సేల్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఫోన్ల స్టాక్ అవుతుంది. ఇక ఆఫ్‌లైన్‌లో కొనాల‌నుకునే వారు గంట‌ల త‌ర‌బ‌డి పెద్ద క్యూలో నిల‌బ‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. 'ఆపిల్ ఐఫోన్ ఎక్స్' భార‌త్ స‌హా ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో ఇవాళ్టి నుంచి మార్కెట్లోకి రానుంది. యాపిల్ సంస్థ 10వ వార్షికోత్సవం సంద‌ర్భంగా విడుద‌ల కాబోతోన్న ఈ ఫోన్ కోసం చాలామంది ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. గ‌త నెల 27న ఈ ఫోన్ కు ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ రోజు నుంచి రిటైల్ స్టోర్ల‌లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఇప్ప‌టికే ఆ ఫోన్ ను సొంతం చేసుకోవ‌డానికి చాలామంది క్యూలైన్ల‌లో ప‌డిగాపులు కాస్తున్నారు. అయితే,  'ఆపిల్ ఐఫోన్ ఎక్స్` ఎందుకు కొనాలి? ఎందుకు కొన‌కూడ‌దు? అన్న విష‌యాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ సంస్థ 10 వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా విడుద‌ల‌వుతున్నందున ఈ ఫోన్ ను మునుప‌టి వెర్ష‌న్ ల కంటే చాలా ఆక‌ర్ష‌ణీయంగా స‌రికొత్త డిజైన్ తో తీర్చిదిద్దారు. ట‌చ్ ఐడీకి బ‌దులుగా ఫేస్ ఐడీని ప్ర‌వేశ‌పెట్టారు. ఫేస్ ఐడీతో ఫోన్ లు అన్ లాక్ చేసుకునే సౌక‌ర్యం క‌లిగిన మొట్ట‌మొద‌టి ఫోన్ ఇదే. 5.8 అంగుళాల ఓఎల్ ఈడీ స్క్రీన్ తో 2436 X 1125  రెజుల్యూష‌న్ ను క‌లిగి ఉంటుంది. డాల్బీ విజ‌న్ ను స‌పోర్ట్ చేస్తూ 458 పిక్సెల్స్ సూప‌ర్ రెటీనా స్క్రీన్ ను క‌లిగి ఉంటుంది. థ‌ర్డ్ పార్టీ యాప్స్ కు కూడా పోట్రేట్ మోడ్ లో ఫొటోలు తీసుకునే సౌక‌ర్యాన్ని ఈ ఫోన్ లో పొంద‌వ‌చ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3డీ మ్యాపింగ్ లు ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌లు. వీటి సాయంతో యానిమోజీలు యూజ‌ర్ల ముఖ క‌వ‌ళిక‌ల‌ను అనుక‌రిస్తాయి. ఈ ప్ర‌త్యేక‌త‌లు ఈ ఫోన్ ను కొనేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.

యాపిల్ ఐ ఫోన్ చాలామందికి అంద‌ని ద్రాక్షే. అందుకు కార‌ణం దాని ధ‌ర అధికం కావ‌డ‌మే. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ ధ‌ర భార‌త క‌రెన్సీలో రూ.89000. ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన అత్యంత ఖ‌రీదైన ఫోన్ ఇదే. గ‌తంలో విడుద‌లైన ఐఫోన్ 8, ఐ ఫోన్ 8 ప్ల‌స్ త‌ర‌హాలోనే ఇందులో కూడా A11 బ‌యోనిక్ చిప్ సెట్ విత్ 6 కోర్ సీపీయూ డిజైన్ లు ఉన్నాయి. ఐఓఎస్ 11 తో ర‌న్ అయిన‌ప్ప‌టికీ ఇందులో కొత్త యూజ‌ర్ ఇంట‌ర్ ఫేస్ ను ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఇది యూజ‌ర్ల‌కు కొద్దిగా ఇబ్బంది క‌లిగించే అంశం. దాదాపుగా ఐ ఫోన్ 8, ఐ ఫోన్ 8 ప్ల‌స్ ల‌ను ఈ ఫోన్ పోలి ఉంటుంది. ఫీచ‌ర్లు కూడా దాదాపుగా స‌మాన‌మే. ఈ ఫోన్ ధ‌ర‌క‌న్నా వాటి ధ‌ర త‌క్కువ‌. ఆల్ గ్లాస్ డిజైన్ ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నప్ప‌టికీ ఈ ఫోన్ ను చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి. పొర‌పాటున గ్లాస్ ప‌గిలి, దానిని మార్చుకోవాలంటే త‌డిసి మోపెడ‌వుతుంది. ఐ ఫోన్ X కొన‌బోయే వినియోగ‌దారులు ఈ విష‌యాల‌ను నిశితంగా గ‌మ‌నించ‌డం మంచిది.
Tags:    

Similar News