ఉగ్ర ఎన్‌కౌంటర్‌ 10 అప్‌డేట్స్‌ : కన్నతండ్రే ఈసడించుకున్నాడు

Update: 2015-04-07 11:20 GMT
వరంగల్‌ జిల్లా జనగామ.. ఆలేరు మధ్య జరిగిన భారీ ఎన్‌ కౌంటర్‌లో ఐదుగురు ఐఎస్‌ఐ ఉగ్రవాదులు మృతి చెందటం తెలిసిందే. వరంగల్‌జిల్లా జైలు నుంచి హైదరాబాద్‌ కు కోర్టు విచారణ నిమిత్తం తీసుకొస్తున్న సమయంలో.. ఉగ్రవాదులు తప్పించుకునే ప్రయత్నం చేయటం.. పోలీసులపై దాడికి యత్నించటంతో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌ కౌంటర్‌ లో వికారుద్దీన్‌ తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందటం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి టెన్‌ అప్‌ డేట్స్‌..
1. జనగామ.. ఆలేరు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై ఆలేరు పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఘటనకు సంబందించి ఆలేరు కోర్టుకు పోలీసులు అన్ని వివరాలు అందజేశారు. ఎన్‌ కౌంటర్‌ పై వివరణ ఇచ్చారు.

2. తెలంగాణ రాష్ట్రంలో ఐదుగురు ఉగ్రవాదులపై జరిపిన ఎన్‌ కౌంటర్‌ కు సంబంధించిన ఘటనపై కేంద్రం ఆరాతీసింది. కేంద్రహోం శాఖ అదికారులు తెలంగాణ డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. ఎన్‌ కౌంటర్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

3. ఉగ్రవాదులను వరంగల్‌ జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలిస్తున్న సమయంలో మినీ బస్సులో ఉన్న ఉగ్రవాదులు పోలీసులపై దాడికి యత్నించారని.. అందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని ఐజీ నవీన్‌చంద్ర వెల్లడించారు.

4. వరంగల్‌ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల ఎన్‌ కౌంటర్‌ తో హైదరాబాద్‌ మహానగరంలో హై అలెర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేక పోలీసు దళాలురంగంలోకి దిగి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

5. తాజాగా జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో తన కొడుకును పోలీసులే పొట్టన పెట్టుకున్నారని వికారుద్దీన్‌ తండ్రి అహ్మద్‌ మహ్మద్‌ వెల్లడించారు.

6. ఉగ్రవాది వికారుద్దీన్‌ తండ్రి అహ్మద్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వికారుద్దీన్‌ పై ఉన్న అభియోగాలకు పక్కా సాక్ష్యాలు ఉన్నా.. పోలీసుల మీద ఆరోపణలు చేస్తూ  అతని తండ్రి మాట్లాడుతున్న తీరు సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

7. వరంగల్‌ జిల్లాలో జరిగిన ఎన్‌ కౌంటర్‌ పై తెలంగాణ విపక్షాలు ఎలాంటి విమర్శ చేయలేదు. బీజేపీ నేతలు పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించారన్నారు.

8. పోలీసులకు స్వేచ్ఛను ఇస్తే ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న ఉగ్రవాద ఘటనల్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ దృష్టికి తీసుకెళ్లారు.

9. తెలంగాణ ప్రాంతం ఉగ్రవాదులకు స్థావరంగా మారిందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

10. వరంగల్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఉగ్రవాదులకు పోస్ట్‌ మార్టమ్‌ నిర్వహించే నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులది బూటకు ఎన్‌కౌంటర్‌ అంటూ ఉగ్రవాది వికారుద్దీన్‌ తండ్రి ఆరోపిస్తూ.. ఈ ఘటనపై తాము కోర్టుకు వెళతామన్నారు.

Tags:    

Similar News