చెత్త వార్త స్పీడెంతో చెప్పిన స‌ర్వే

Update: 2018-03-11 09:50 GMT
పుకారు వేగం ఎంతో తెలిసిందే. టీవీలు.. సెల్ ఫోన్లు లేని కాలంలో పుకార్ల పుణ్య‌మా అని మ‌హా కాల‌క్షేపం ఉండేది. ఖాళీగా ఉండ‌టంతో.. ప‌నేం లేక ఇలాంటివి పుట్టిస్తార‌న్న మాట బ‌లంగా వినిపించేది. ఇప్పుడు కాలం మారింది. జీవితం చాలా వేగంగా మారింది. కళ్లు తెరిచి మూసే స‌మ‌యానికి వారం చ‌టుక్కున మారిపోతోంది.క్యాలెండ‌ర్లో నెల‌లు వారాల మాదిరి ప‌రుగులు తీస్తున్నాయి.

ఇలాంటి వేళ‌లో కూడా.. అబ‌ద్ధాలు.. అస‌త్యాల‌తో కూడిన బూట‌క‌పు వార్త‌ల‌కు ఆద‌ర‌ణతో పాటు.. వాయు వేగంతో వ్యాప్తి చెందే ప‌రిస్థితి ఉంద‌న్న విష‌యం తాజాగా నిర్వ‌హించిన ఒక స‌ర్వే వెల్ల‌డించింది. ఈ స‌ర్వే చూసిన‌ప్పుడు.. కాలం మారని.. పుకార్ల విష‌యంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.

కాకుంటే.. గ‌తంలో న‌లుగురు మ‌నుషులు క‌లిసిన‌ప్పుడు.. ర‌చ్చ బండ మీద కూర్చున్న‌ప్పుడు మాట్లాడుకునే చాలా మాట‌లు.. ఇప్పుడు ఎవ‌రికి వారు వారి.. వారి ఫోన్ల‌లో చూసుకోవ‌టం.. వాటిని షేర్ చేస్తూ వ్యాప్తి చేయ‌టం అంత‌కంత‌కూ పెరుగుతోంది. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని.. త‌మ‌కు తెలిసిన విష‌యాల్లో నిజానిజాల్ని చెక్ చేసుకోకుండా వెనువెంట‌నే వేరే వారికి షేర్ చేసుకోవ‌టం ఎక్కువ అవుతోంది.

ఈ తీరు ఎంత వేగంగా ఉంద‌న్న విష‌యాన్ని అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నిపుణులు ఒక రీసెర్చ్ చేపట్టారు. 2006 నుంచి 2017 మ‌ధ్య కాలంలో ట్విట్ట‌ర్ లో వైర‌ల్ అయిన 1,26,000 వార్త‌ల్ని వారు విశ్లేషించారు. వీటిలో సింహ‌భాగం బూట‌క‌పు వార్త‌ల్ని రీట్వీట్ చేసే అవ‌కాశం 70 శాతం ఎక్కువన్న విష‌యాన్ని తేల్చారు.

అంతేకాదు నిజ‌మైన వార్త‌ల కంటే ప‌ది నుంచి 20 రెట్లు వేగంతో అబ‌ద్ధ‌పు వార్త‌లు వైర‌ల్ అవుతాయ‌ని తేలింది. ఏదైనా ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్పుడు వాస్త‌వాల కంటే కూడా వ‌దంతులే ఎక్కువ‌గా వైర‌ల్ అవుతున్న విష‌యాన్ని గుర్తించారు. అస‌త్య‌వార్త‌ల‌కు ఎక్కువ‌గా ఆక‌ర్షితులు కావ‌ట‌మే దీనికి కార‌ణంగా భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇలాంటి వార్త‌ల్నే ఎక్కువ మంది రీట్వీట్ చేస్తుంటారని తేల్చారు. ఇత‌రుల‌కు అప్ప‌టివ‌ర‌కూ తెలీని వార్త‌ల్ని.. కొంగొత్త విష‌యాల్ని తెలిసిన వారికి చెప్పాలన్న ఆత్రుతే.. అస‌త్య వార్త‌లు వైర‌ల్ అయ్యేందుకు కార‌ణంగా విశ్లేషించారు.


Tags:    

Similar News