జగన్ ప్రకటనపై తప్పుడు ప్రచారమా ?

Update: 2021-08-09 05:37 GMT
'అసెంబ్లీ సాక్షిగా అమరావతిని జగన్మోహన్ రెడ్డి ఆమోదించి, నేడు అదే అసెంబ్లీ సాక్షిగా అమరావతిని అడ్డుకుంటున్నారు’..ఇది తాజాగా యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు. అమరావతిని రాజధానిగా చేయటం అన్నది నిస్సందేహంగా చంద్రబాబునాయుడు ఏకపక్ష నిర్ణయమని అందరికీ తెలిసిందే. ఏపికి రాజధానిగా ఎక్కడైతే బాగుంటుందనే విషయంలో చంద్రబాబు ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు. కొంతమంది ముఖ్యులతో మాట్లాడుకుని అమరావతిని రాజధానిగా నిర్ణయించేసి దాన్నే అసెంబ్లీలో ప్రకటించారు.

ఇక జగన్ విషయానికి వస్తే అమరావతిని రాజధానిగా ఆమోదించిన మాట వాస్తవమే. అయితే కండీషనల్ ఆమోదం తెలిపారు. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు అవసరమని చెప్పిన జగన్ అందుకు అవసరమైన భూములను రైతుల నుండి, ప్రైవేటు వ్యక్తుల నుండి సేకరించవద్దని కండీషన్ పెట్టారు. మొత్తం ప్రభుత్వ భూములను ఉపయోగించాలని గట్టిగా చెప్పారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించేశారు కాబట్టి, తాము వద్దన్నా వినిపించుకోరు కాబట్టి తాను అమరావతిని అంగీకరిస్తున్నట్లు స్పష్టంగా చెప్పారు.

రాజధాని నిర్మాణానికి రైతులు, ప్రైవేటు భూములు తీసుకోవద్దని జగన్ చెప్పిన విషయాన్ని యనమల, చంద్రబాబునాయుడు అండ్ కో ఎందుకు మాట్లాడటంలేదు. ప్రభుత్వ భూముల్లో మాత్రమే రాజధాని నిర్మాణానికి ఉపయోగించాలని చెప్పిన కండీషన్ గురించి ఎందుకు ప్రస్తావించటంలేదు. ఆరోజు రాజధాని గురించి జగన్ చేసిన ప్రకటన తాలూకు వీడియో క్లిప్పింగులు ఇప్పటికీ యూట్యూబ్ లో దొరుకుతున్నాయి.

ఒకసారి రెండు నిముషాల వీడియో క్లిప్పింగులను చూస్తే జగన్ చేసిన ప్రకటన స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవం ఇలాగుండగా యనమల మాత్రం అమరావతిని రాజధానిగా ఆమోదిస్తున్నట్లు జగన్ చెప్పిన ఒక మాటను మాత్రమే పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసలు అమరావతిని భ్రమరావతిగా చేసేసిన వ్యక్తి చంద్రబాబే. రాజధాని నిర్మాణం విషయంలో ఏదో భ్రమల్లో ఉండకుండా ఏపి ఆర్ధికపరిస్ధితికి తగ్గట్లుగా అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్, హైకోర్టు శాశ్వత భవనాలు నిర్మించేసుంటే సరిపోయేది.

పై నాలుగు భవనాలను నిర్మించేసి మిగిలిన డెవలప్మెంట్ ను జనాలకే వదిలేసుంటే ఈపాటికే మొత్తం డెవలప్ అయిపోయుండేది. రాజధాని మార్పు చేయటానికి ఇపుడు జగన్ కు అవకాశం ఉండేదికాదు. ఇక ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు మొదలుపెట్టిన రాజధాని నిర్మాణాన్ని ఏదో రూపంలో పూర్తిచేయాల్సిన బాధ్యత జగన్ పైనా ఉంది. కానీ జగన్ కూడా దాన్ని విస్మరించి కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఇద్దరు నేతల మధ్య ఇగో ప్రాబ్లెమ్ వల్ల ఏపికి రాజధాని లేకుండా పోయింది.
Tags:    

Similar News