కొత్త వ్యసనం చుట్టేస్తోంది.. సోషల్ మీడియాకు బానిసలవుతున్నారా?

Update: 2019-12-16 04:40 GMT
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్.. అందులో డేటా.. దానికి తగ్గట్లే పలు రకాల సోషల్ మీడియా యాప్స్. ఇవాల్టి రోజున ప్రతి ఒక్కరూ ఇందులో మునిగిపోతున్న పరిస్థితి. భార్య..భర్త.. బాయ్ ఫ్రెండ్.. గాళ్ ఫ్రెండ్.. ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నా.. మొబైల్ ఫోన్ వరకూ వచ్చేసరికి మాత్రం ఎవరి లోకం వారిదే. ఎవరి సోషల్ మీడియా లెక్కలు వారివే అన్నట్లుగా మారిపోయిన పరిస్థితి.

ఇక.. ఇళ్లల్లోనూ సీన్లు మారిపోతున్నాయి. ఒకప్పుడు కుటుంబమంతా కూర్చొని భోజనం చేయటం.. కలిసి మాట్లాడుకోవటం లాంటివి పోయి.. ఇప్పుడు అందరూ ఇంట్లో ఉన్నా..ఎవరికి వారు వారి.. వారి వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో బిజీగా ఉంటారు. కలిసే ఉన్నట్లు కనిపిస్తారు కానీ.. ఎవరి లోకం వారిదన్నట్లుగా మారింది.

ఒకప్పుడు మందు తాగటం.. సిగిరెట్ తాగటం లాంటి వ్యసనాలు ఉండేవి. ఇప్పుడు వాటికి మించిన వ్యసనం మొబైల్ ఫోన్ గా మారింది. సోషల్ మీడియాకు ఒకసారి బానిసలుగా మారితే.. ఇక అంతే సంగతులు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. పిల్లలు.. ముఖ్యంగా విద్యార్థులు సోషల్ మీడియాకు.. మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారొద్దన్న హెచ్చరికలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి.

మొబైల్ కు.. సోషల్ మీడియాకు బానిసలుగా మారితే వచ్చే ప్రమాదం సమయాన్ని వృథా చేసుకోవటమే. అంతేకాదు.. సోసల్ మీడియాను ఒకస్థాయి దాటి వినియోగించటం ద్వారా ఆలోచనా శక్తి తగ్గుతుందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వాడుకోవటం తప్పు కాదు కానీ.. మితిమీరినట్లుగా వాడటం ఏ మాత్రం క్షేమకరం కాదని చెబుతున్నారు. సోషల్ మీడియాకు.. మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారితే భవిష్యత్తు దెబ్బ తినటం ఖాయమంటున్నారు. జర జాగ్రత్తగా ఉండండి సుమా.
Tags:    

Similar News