రాష్ట్రప‌తి అశ్వానికి ఘ‌న వీడ్కోలు.. భారీ సంబ‌రం

Update: 2022-01-27 06:32 GMT
సాధార‌ణంగా ఎవ‌రైనా ఉద్యోగ విర‌మ‌ణ పొందితే.. ఆయ‌న కుటుంబంలో ఒకింత ఆనందం.. అదేస‌మ‌యంలో అప్పుడే రిటైర్మెంట్ వ‌య‌సు వ‌చ్చిందా.. అనే ఆవేద‌న కూడా క‌నిపిస్తుంది. మ‌రి జంతువుల‌కు! అస‌లు ఈ మాట ఇప్ప‌టి వ‌ర‌కు విని ఉండ‌రు. ఎందుకంటే.. జంతువుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ ఏంటి? అనే మాట వినిపిస్తుంది. కానీ.. జంతువుల‌కు కూడా ప‌ద‌వీ విర‌మ‌ణ ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు పోలీసు విభాగంలో ప‌నిచేసే జాగిలాల‌(డాగ్స్‌)కు ప‌ద‌వీ విర‌మ‌ణ ఉంటుంది. వాటి వ‌య‌సును బ‌ట్టి శారీర ద్రుఢ‌త్వాన్ని బ‌ట్టి.. నిర్ణీత వ‌య‌సులో వాటికి విరామం ప్ర‌క‌టించేస్తారు. ఇక‌, అప్ప‌టి నుంచి అవి పోలీసు జాగిలాలుగా ప‌రిగ‌ణించ‌బ‌డినా.. విధుల‌కు దూరంగా ఉంటాయి.

అదేవిధంగా పెద్ద పెద్ద దేవాల‌యాల్లో విధుల్లో ఉండే గ‌జ‌రాజులుకు కూడా విరామ వ‌య‌సు నిర్ణ‌యిస్తారు. ఆ స‌మ‌యం వ‌చ్చాక‌.. వాటిని కూడా ప‌క్క‌న పెట్టేస్తారు. గ‌జ‌శాల‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేస్తారు. లేదా.. జంతు ప్ర‌ద‌ర్శ‌న శాల‌ల‌కు త‌ర‌లించేస్తారు. ఇక‌, అదేవిధంగా దేశ సైనిక రంగంలో ప‌నిచేసిన అశ్వాల‌కు కూడా విర‌మ‌ణ వ‌య‌సు ఉంటుంది. ఆ వ‌య‌సు వ‌చ్చాక‌.. అవి ఎంత ఆరోగ్యంగా ఉన్నా.. ప‌క్క‌న పెట్టేసి విశ్రాంతి క‌ల్పిస్తారు. ఈ క్ర‌మంలో తాజాగా అనేక మంది రాష్ట్రపతుల వద్ద 13 ఏళ్ల పాటు సేవలందించిన విరాట్ అనే అశ్వానికి రిప‌బ్లిక్ డే ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా  రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు.

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ విరాట్ గుర్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేమతో నిమిరారు. గణతంత్ర దినోత్సవాల వేళ చివరి పరేడ్‌లో పాల్గొన్న విరాట్‌ను రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్, ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఘనంగా సాగనంపారు. విరాట్ గత 13 సంవత్సరాలుగా అనేక జాతీయ దినోత్సవాల్లో సేవలందించింది. కోవింద్ కంటే ముందు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభాపాటిల్ వద్ద కూడా విరాట్  సేవలందించింది.

 ఈ ఏడాది ఈ గుర్రానికి ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ మెడల్ అందించి ఘనంగా వీడ్కోలు పలికారు. సాధారణంగా 17 లేదా 18 సంవత్సరాలకు గుర్రాలు రిటైర్ అవుతాయి. విరాట్ ప్రస్తుత వయసు 21.  దీంతో అది ఆరోగ్యంగానే ఉన్న‌ప్ప‌టికీ.. వ‌య‌సు రీత్యా రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News