నగర నడిబొడ్డున అన్నదాత ఉరి

Update: 2015-09-10 04:47 GMT
నిన్న మొన్నటి వరకూ జిల్లాలకు మాత్రమే పరిమితమైన అన్నదాతల ఆత్మహత్యల పరంపర తాజాగా రాజధానికి చేరింది. నిజామాబాద్ కు చెందిన లింబాద్రి అనే రైతు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లోయర్ ట్యాంక్ బండ్ లోని ఒక కరెంటుస్తంభానికి ఉరేసుకొని తనువు చాలించటం సంచలనం సృష్టిస్తోంది.

మూడేళ్లుగా వ్యవసాయంలో వచ్చి పడుతున్న నష్టాలతో పాటు.. తాజాగా పెద్దకొడుక్కి పెద్ద జబ్బు చేసిందన్న వార్తతో తల్లడిల్లిపోయాడు. కొడుక్కి వైద్యం చేయించే దిక్కు లేక.. అప్పు పుట్టక.. వెధవ జీవితం ఎందుకని అనుకున్నాడో కానీ.. ముచ్చటైన ముగ్గురు పిల్లలు.. భార్యను వదిలేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మూడేళ్లుగా వ్యవసాయానికి వచ్చి పడుతున్న వరుస అప్పులతో మొత్తంగా రుణ భారం రూ.4లక్షలకు పైగా తేలింది. ముగ్గురు పిల్లల్లో పెద్దవాడు నరేశ్ డిగ్రీ పూర్తి చేశాడు... కుమార్తె నవీత డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. మూడో సంతానం నవీన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మొదటి కుమారుడు నరాల జబ్బుకు వచ్చిందని.. చికిత్స చేసేందుకు అవసరమైన డబ్బు లేకపోవటంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు.

మొదట బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా.. బస్సు డ్రైవర్ సకాలంలో స్పందించి బ్రేకులు వేయటంతో బతికిపోయాడు. అతని పరిస్థితిని గుర్తించి అక్కడి పోలీసు నచ్చజెప్పి లింబాద్రిని పంపేశారు. అనంతరం గుడికి వెళ్లి.. పూజారికి తన గోడు వెళ్లబోసుకున్న అతను.. గుడి నుంచి బయటకు వచ్చి దగ్గర్లోని కరెంటు స్తంభానికి ఉరేసుకొని మరణించాడు. నగర రోడ్డు పక్కన.. కరెంటు స్తంభానికి విగతజీవిగా వేలాడుతున్న రైతును చూసిన ప్రతొక్కరి కడుపు తరుక్కుపోతోంది. వరుసగా చోటు చేసుకుంటున్న అన్నదాతల ఆత్మహత్యలకు పుల్ స్టాప్ పెట్టేలా కేసీఆర్ స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికి జరిగింది చాలు.. ఇకపై బలవన్మరణాలు చోటు చేసుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News