టైమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై రైతు ఉద్య‌మం.. మ‌మ్మ‌ల్ని భ‌య‌పెట్ట‌లేరంటున్న మ‌హిళ‌లు!

Update: 2021-03-06 09:30 GMT
న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తెచ్చిన వ్య‌వ‌సాయ చాట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్య‌మం.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత టైమ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపైకి ఎక్కింది. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో కొన‌సాగుతున్న ఉద్య‌మంలో మ‌హిళా రైతులు కూడా పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. మ‌రో రెండు రోజుల్లో మ‌హిళా దినోత్స‌వం ఉన్న నేప‌థ్యంలో ప్ర‌త్యేక సంచిక‌ను ప్ర‌చురించింది టైమ్ మ్యాగ‌జైన్‌. ఈ మ్యాగ‌జైన్‌ క‌వ‌ర్ పేజీని ట్విట‌ర్ లో పోస్ట్ చేసింది ఆ సంస్థ‌.

‘న‌న్ను బెదిరించ‌లేరు.. న‌న్ను కొన‌లేరు’ శీర్షికన ఈ స్పెషల్ ఆర్టికల్ ను ప్రచురించింది టైమ్. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీరి పోరాటానికి అంతర్జాతీయంగా కూడా మద్దతు లభించింది. అయితే.. ఇది తమ సొంత విషయం అంటూ పలువురు స్పందించిన విషయం కూడా తెలిసిందే.

అయితే.. ఈ ఆందోళ‌న‌లో మ‌హిళా రైతులు కూడా భారీగా పాల్గొంటున్నారు. పంజాబ్‌, హ‌ర్యానా, ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు చెందిన మ‌హిళా రైతులు ఉద్య‌మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి అనుభ‌వాలు ఏంటీ అన్న కోణంలో క‌వ‌ర్ స్టోరీని రాసింది టైమ్ మ్యాగ‌జైన్‌. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తోపాటు.. మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపులు, లింగ వివ‌క్ష‌, స్త్రీ హ‌త్య‌ల‌కు వ్య‌తిరేకండా కూడా ఈ మ‌హిళ‌లు పోరాడుతున్నార‌ని క‌థ‌నంలో పేర్కొంది.

కాగా.. రైతుల ఉద్య‌మం వంద రోజుల‌కు చేరుకున్న సంద‌ర్భంగా మార్చి 6వ తేదీన బ్లాక్ డేగా పాటించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా కుండ్లి-మానేస‌ర్ ప‌ల్వాల్ ఎక్స్ ప్రెస్ హైవేను 5 గంట‌ల‌పాటు దిగ్భందించ‌బోతున్నారు. ప్ర‌భుత్వంతో దాదాపు ప‌ది ద‌శ‌ల్లో జ‌రిపిన చ‌ర్చ‌ల్లో సానుకూల ఫ‌లితాలు రాక‌పోవ‌డంతో అన్న‌దాత‌లు ఆందోళ‌న కొన‌సాగిస్తూనే ఉన్నారు.
Tags:    

Similar News