బీజేపీకి రైతుల సెగ‌.. 5రాష్ట్రాల ఎన్నికల్లో ఓడించడానికి రైతుల టీమ్స్!

Update: 2021-03-03 03:30 GMT
కొత్త‌గా తెచ్చిన‌ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. దాదాపు మూడు మాసాలుగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఉద్య‌మం చేస్తున్న రైత‌న్న‌ల సెగ .. బీజేపీకి భారీగా త‌గులుతుందా?  త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నిక‌ల్లో బీజేపీ వ్య‌తిరేకంగా రైతులు ఉద్య‌మించాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాలు.. బీజేపీ ఆశ‌ల‌పై నిలువునా నీళ్లు కుమ్మ‌రిస్తుందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల ప‌లు రాష్ట్రాల్లో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే.. ఒక్క హ‌రియాణ‌లో మాత్రం బీజేపీకి ఊహించ‌ని దెబ్బ‌త‌గిలింది. దీనికి కార‌ణం.. రైతులే! ఈ విష‌యాన్ని అక్క‌డి బీజేపీ నేత‌లు సైతం అంగీక‌రించారు.

ఇక‌... ఇప్పుడు ఇదే ఊపుతో అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బీజేపీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతామ‌ని.. రైతులు చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల‌ని బీజేపీ పెట్టుకున్న ఆశ‌లు క‌ల్ల‌లు అవుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతామ‌ని.. ఆయా రాష్ట్రాలకు తమ కార్యకర్తలను పంపించి బీజేపీ అభ్యర్థుల్ని ఓడించేందుకు కృషి చేస్తామని స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకులు, రైతు ఉద్య‌మంలో కీల‌క నేత‌ యోగేంద్ర యాదవ్ అన్నారు. ‘‘బీజేపీ సహా దాని మిత్రపక్షాలు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాయి ఆ చట్టాలకు వ్యతిరేకంగా బీజేపీని ఓడించాలి. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మా టీంలను పంపిస్తాం`` అని యాద‌వ్ వ్యాఖ్యానించారు.

మార్చి 12న కోల్‌కతాలో బహిరంగ సభతో తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. ఈ సభలో 10 ముఖ్యమైన కార్మిక సంఘాలు కూడా పాల్గొనబోతున్నాయ‌ని తెలిపారు. ఇక‌, ఇదే విష‌యంపై  భారతీయ కిసాన్ యూనియన్ నేత బల్బీర్ ఎస్ రాజేవాల్ మాట్లాడుతూ తాము ‘‘ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని అయితే ఆయా స్థానాల్లో బీజేపీని ఓడించే సమర్ధులకు మద్దతుగా ఉండి.. బీజేపీని ఓడించేందుకు సహకరిస్తాం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు టీంలను పంపేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాం. మేం ప్రజలకు మోడీ ప్రభుత్వ దుర్మార్గాల గురించి చెబుతాం. వాళ్లు చేసిన చేస్తోన్న చేయబోతున్న కుట్రల గురించి వివరించి బీజేపీని ఓడించమని చెబుతాం’’ అని అన్నారు. ఈ ప‌రిణామాలు ఇప్పుడు బీజేపీలో సెగ‌లు పుట్టిస్తున్నాయి. దీనిని ఎదుర్కోవ‌డం అంత సాధ్యం కాద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News