దా‘రుణం’; పండగపూట ప్రాణాలు తీసుకున్నారు

Update: 2015-10-24 06:13 GMT
ఓ పక్క బతుకమ్మ.. మరోపక్క దసరా పండుగను ధూంధాంగా జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగని దుస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణతో ఉన్నా.. రుణభారం రైతుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం నుంచి భరోసా లేకపోవటం.. చేసిన రుణాలు భవిష్యత్తును భయపెడుతున్న నేపథ్యంలో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

గురు..శుక్రవారం రెండు రోజుల వ్యవధిలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 13 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటం గమనార్హం. మరో ఐదుగురు రైతులు గుండెపోటుతో మరణించారు. పండగపూట పిల్లాపాపలతో సరదాగా గడపాల్సిన వారంతా.. ఆత్మహత్యలు చేసుకోవటం పలువురిని కదిలిస్తున్నాయి. సాగు కోసం అప్పులిచ్చిన వాళ్లు ఇళ్ల చుట్టూ తిరుగుతూ.. సూటిపోటి మాటలు అనటంతో.. అవమాన భారాన్ని తట్టుకోలేని అన్నదాతలు బతుకు చాలిస్తున్నారు. పురుగులు మందులు తాగి కొందరు.. బావిలో దూకి ఒకరు.. నిప్పు అంటించుకొని ఇంకొకరు మరణించారు.

ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతలు జిల్లాల వారీగా చూస్తే మెదక్ (2).. నల్గొండ (2).. ఖమ్మం (3).. వరంగల్ (3).. మహబూబ్ నగర్ (3) అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక.. గుండెనొప్పి కారణంగా మరణించిన రైతుల్ని జిల్లాల వారీగా చూస్తే.. మహబూబ్ నగర్ (3).. రంగారెడ్డి (1).. నిజామాబాద్ (1)లు ఉన్నారు.
Tags:    

Similar News