మరో ఉద్యమానికి రెడీ అవుతున్న రైతు సంఘాలు

Update: 2022-05-04 13:30 GMT
జాతీయస్థాయిలో రైతు సంఘాలు మరో ఉద్యమానికి రెడీ అవుతున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొందరలోనే భారీ ఎత్తున ఉద్యమం చేపట్టాలని తాజాగా ఢిల్లీలో జరిగిన రైతు సంఘాల ప్రతినిధుల సమావేశం తీర్మానం చేశారు.

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీలోని సింఘూ దగ్గర రైతు సంఘాల ఆధ్వర్యంలో దాదాపు ఏడాదికిపైగా రైతులు ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. ఆ ఉద్యమం దెబ్బకు నరేంద్ర మోడీ దిగొచ్చి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే వ్యవసాయ చట్టాలను అయితే రద్దు చేశారు కానీ ఆ నేపథ్యంలో వేలాదిమంది రైతులపై పెట్టిన కేసులను మాత్రం ఉపసంహరించలేదు. కేసుల ఉపసంహరణ ప్రక్రియే ఇంకా మొదలు కాలేదు. ఈ విషయంతో పాటు మరికొన్ని అంశాలను చర్చించేందుకు యునైటెడ్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వివిధ రైతు సంఘాలకు చెందిన నేతలు సుమారు 80 మంది హాజరయ్యారు. కేంద్రప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న అనేక డిమాండ్లపై ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించకపోవటం, ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో రైతుల మరణాలకు కారణమైన కేంద్ర మంత్రి కుమారుడు కేసు విచారణ నత్తనడకన నడుస్తుండటాన్ని రైతు సంఘాల ప్రతినిధులు తప్పుపట్టారు. డిమాండ్ల సాధనకు గతంలో కన్నా ఇపుడు మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమావేశంలో తీర్మానం జరిగింది.

తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించకపోతే మరో ఉద్యమం తప్పదని రైతు సంఘాల నేతలు జగ్జీత్ సింగ్ దల్హేవాల్, శివకుమార్ కక్కా కేంద్రాన్ని హెచ్చరించారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సమావేశంలో రాకేష్ తికాయత్ పాల్గొన్నది లేనిదీ తెలియలేదు. ఎందుకంటే సింఘూ దగ్గర జరిగిన రైతు ఉద్యమాన్ని నడపటంలో తికాయత్ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో రైతు ఉద్యమం దెబ్బకు మొన్నటి యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందులు తప్పవని అందరూ అనుకున్నారు. అయితే అసలు ఆ ఉద్యమ ప్రభావమే కనబడలేదు. పంజాబ్ లో మాత్రం బీజేపీపై ప్రభావం చూపినట్లే అనుకోవాలి.
Tags:    

Similar News