తండ్రీ, కొడుకులిద్దరు తగులుకున్నట్లేనా ?

Update: 2021-01-01 12:30 GMT
ఒకపుడు దేశంలో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసులో తండ్రి, కొడుకులిద్దరు తగులుకున్నట్లేనా ? జరుగుతున్నపరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. 2015 మహానాడు సందర్భంగా ఓటుకునోటు కేసు కుట్రకు ఏ విధంగా తెరలేచిందనే విషయాన్ని జెరూసలేం ముత్తయ్య సవివరంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు వివరించారు. ఈ కేసులో ముత్తయ్య ఏ 4 నిందితుడుగా ఉన్నారు.

తాజాగా ఆయన ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. తాను అప్రూవర్ గా మారిపోయి కేసు వెనకున్న మొత్తం విషయాన్ని వివరిస్తానని రిక్వెస్టు చేసుకున్నారు. దాంతో ఈడి ఉన్నతాధికారులు అనుమతించిన తర్వాత కేసు పూర్వపరాలనంతా పూసగుచ్చినట్లు వివరించారు. ముత్తయ్య చెప్పిన ప్రకారం కేసుకు సూత్రదారి చంద్రబాబునాయుడు. కీలకపాత్రదారులు అప్పటి టీడీపీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి, జిమ్మీబాబు, నారా లోకేష్, ఐపీఎస్ ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావులట.

తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు చంద్రబాబు పోటీలోకి దింపారు. అందుకని తెలంగాణా నామినేటెడ్ ఎంఎల్ఏ స్టీఫెన్ సన్ ఓటు కొనుగోలుకు ప్లాన్ చేశారు. స్టీపెన్ తో మాట్లాడేందుకని ముత్తయ్యను రేవంత్ రంగంలోకి దింపారు. మహానాడు సందర్భంగా రేవంతే ముత్తయ్యను చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్ళారట. అక్కడే స్టీఫెన్ తో రూ. 5 కోట్లకు ఓటు కొనుగోలుకు బేరం సెటిలైంది.

టీడీపీకి అనుకూలంగా ఓటు వేస్తే రూ. 5 కోట్లు, ఓటింగ్ నుండి గైర్హాజరైతే రూ. 3 కోట్లిచ్చేట్లు చంద్రబాబు ముత్తయ్యకు ప్రామిస్ చేశారట. దీనికోసమని రూ. 50 లక్షలు అడ్వాన్సు కూడా చంద్రబాబే రెడీ చేశారట. ఆ తర్వాతే స్టీఫెన్ తో ముత్తయ్య మాట్లాడారు. అయితే రేవంత్ తోనే తాను మాట్లాడుతానని నామినేటెడ్ ఎంఎల్ఏ చెప్పటంతో అదే విషయాన్ని చెబితే అప్పుడు రేవంత్ డబ్బులతో ఎంఎల్ఏ ఇంటికి చేరుకున్నట్లు ముత్తయ్య చెప్పారు.

అంతకుముందు స్టీఫెన్ తో తన సమక్షంలోనే చంద్రబాబు ఫోన్లో మాట్లాడి డబ్బుల విషయంలో భరోసా కూడా ఇచ్చినట్లు ముత్తయ్య వాజ్మూలం ఇచ్చారు. స్టీఫెన్ ఇంట్లో రేవంత్ డబ్బులతో ఉన్నపుడు హఠాత్తుగా ఏసీబీ అధికారులు రెయిడ్ చేసి అరెస్టు చేసిన తర్వాత తాను లోకేష్ ను కలిసినట్లు చెప్పారు. మొదట తనను ఎన్టీయార్ ట్రస్టు భవన్లో దాచి తర్వాత విజయవాడకు పంపేశారట. అక్కడ, లోకేష్, ఏబి వెంకటేశ్వరరావు కలిసి తనను జాగ్రత్తగా కాపాడినట్లు చెప్పుకొచ్చారు.

ముత్తయ్య చెప్పిన విషయాలను బట్టి చంద్రబాబు, లోకేష్ తో పాటు చాలామంది గట్టిగానే తగులుకున్నట్లు అర్ధమవుతోంది. కేసులో తనను పూర్తిగా ఇరికించేసి మిగిలిన అందరు తప్పించుకునేందుకు చూస్తున్నారంటూ ముత్తయ్య మండిపోయారు. తనతో పాటు అందరు నిందితులే కాబట్టి అందరు శిక్షను అనుభవించాల్సిందే అన్నారు. కేసులో కీలక నిందితుడు అప్రూవర్ గా మారిన నేపధ్యంలో మరి ఈడీ అధికారులు ఎలా ముందుకెళతారో చూడాల్సిందే.
Tags:    

Similar News