తండ్రికి కొడుకు బాధ్యత లెక్క చెప్పిన కోర్టు

Update: 2016-03-20 04:13 GMT
ఆసక్తికర తీర్పు ఒకటి గుజరాత్ హైకోర్టు తాజాగా వెల్లడించింది. అమెరికా లాంటి దేశాల్లో నిత్యం పాటించే ఒక విధానానికి ఇండియాలో ఇంచుమించు చట్టబద్ధత కల్పించేలా తన నిర్ణయాన్ని వెల్లడించొచ్చని చెప్పొచ్చు. ఇంతకీ ఆ నిర్ణయం మరేమీ కాదు.. కొడుకును సాకే విషయంలో వయోపరిమితిని తేల్చి చెప్పేసింది. కొడుకు.. కూతుళ్లను కని.. పెంచిన తర్వాత వారి బాధ్యత ఎంతకాలం వరకు తల్లిదండ్రులపై ఉంటుందన్న అంశంపై తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఒక వయసు వచ్చే వరకు మాత్రమే కొడుకును చూసుకొని.. వారిని పోషించాల్సిన బాధ్యత ఉంటుందన్న విషయాన్ని తేల్చింది. తాజాగా వెల్లడించిన ఈ తీర్పు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. కొత్త చర్చకు తావిచ్చేలా ఉంది.

ఇంతకీ కోర్టు చెప్పిందేమంటే.. 18 ఏళ్లు దాటిన తర్వాత కొడుకు బాధ్యత తల్లిదండ్రులకు ఉండదని తేల్చింది. ఆ వయసు వరకు కొడుకు బాధ్యత తప్పనిసరిగా తల్లిదండ్రుల మీద ఉంటుందని.. ఆ తర్వాత కొడుకు బాధ్యత ఉండదని తేల్చింది. అదే సమయంలో ఆడపిల్ల విషయంలో వయసుతో సంబంధం లేకుండా.. పెళ్లి అయ్యే వరకూ తల్లిదండ్రులదే బాధ్యతని తేల్చింది.

గుజరాత్ లో డాక్టర్ గా పని చేస్తున్న దినేశ్ అనే వ్యక్తి కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా తాజా తీర్పు వెల్లడైంది. దినేశ్ కి 2006లో తన భార్యతో విడాకుల్ని కోర్టు ఇచ్చింది. ఆ సందర్భంగా కొడుక్కి 18 ఏళ్లు వచ్చే వరకూ బాధ్యతగా చూసుకోవాలంటూ ఆ డాక్టర్ కు కోర్టు చెప్పింది. దీంతో కొడుక్కి 18 ఏళ్లు వచ్చే వరకూ చూసుకున్న అతను.. కొడుక్కి 18 ఏడు వచ్చిన వెంటనే చూడటం మానేశాడు. ఆర్థికంగా సాయం చేయటం లేదు.

దీనిపై అతడి మాజీ భార్య మరోసారి కోర్టు గుమ్మం ఎక్కింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు స్పందిస్తూ.. కొడుకు విషయంలో 18 ఏళ్ల వరకూ కొడుకును చూసుకుంటే సరిపోతుందని.. కుమార్తె విషయంలో మాత్రం పెళ్లి అయ్యేవరకూ తల్లిదండ్రులదే బాధ్యత అని తేల్చి చెప్పింది.
Tags:    

Similar News