పోలీసుల ముందే ఆ నీచుడలా మాట్లాడాడా?

Update: 2015-10-25 05:21 GMT
ఐదు వేల మంది అమ్మాయి ఫోన్ నెంబర్లు సేకరించి దాదాపు 300 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి దొరికిపోయిన కామాంధుడు మధుకు సంబంధించి ఆసక్తికర వ్యవహారం ఒకటి బయటకొచ్చింది. తాను చేసిన పని పట్ల ఎలాంటి జంకూ బొంకూ లేని ఇతగాడి వ్యవహారశైలి పోలీసులకు సైతం షాకిస్తోంది. ఇప్పటికే ఇతని నేర చరిత్ర గురించి వింటున్న వారికి నోట వెంట మాట రాని పరిస్థితి. విచారణలో భాగంగా లభిస్తున్న సమాచారం వారికి షాకుల మీద షాకులిచ్చేలా ఉంటోంది.

మొదట్లో అనుకున్నట్లుగా ఐదు వేల మంది అమ్మాయిల డేటా కాదు.. దాదాపు వేలల్లో ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక.. పోలీసుల విచారణలో ఇతగాడి వ్యవహరిస్తున్న తీరు.. మాట్లాడుతున్న మాటలు వింటే వీడి బరితెగింపు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. తనపై నమోదు చేస్తున్న కేసుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న ఇతగాడు.. తాను త్వరలోనే బయటకు వస్తానని చెబుతున్నాడు. ఒకవేళ జైల్లో పది..పదిహేను రోజులు ఉన్నప్పటికీ బయటకు రావటం ఖాయమని.. వచ్చిన వెంటనే తన పని తాను మళ్లీ మొదలు పెడతానని బరితెగింపుగా మాట్లాడటం గమనార్హం.

అతడితో మాట్లాడేందుకు కొందరు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినప్పుడు.. పోలీసుల ముందే ఇతగాడి మాటలు విన్న వారికి మతి పోయిన పనైంది. ‘‘సార్.. మూడు కేసులు నమోదయ్యాయి. ఒకదాంట్లో సాక్ష్యం లేదని కొట్టేశారు. మిగిలినవి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే సాక్ష్యాలు లేవు కదా. ఎవరైనా సాక్ష్యం చెప్పేందుకు వస్తే.. వారితో రాజీ చేసుకుంటా’’ లాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. లా పూర్తి చేసిన ఇతగాడు.. చదువుల్లో మేటిగా చెబుతారు. టెన్త్.. ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఇతగాడికి తెలివితేటలు చాలా ఎక్కువ. ఇన్ని తెలివితేటలు ఉన్నా.. బుద్ధి మాత్రం సైకోను తలపించేలా ఉంటుంది. ఇన్ని తెలివితేటలు ఉన్న వాడు సరైన పద్ధతిలో సాగితే ఎంతబాగుండన్న మాటలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఇంతటి బరితెగింపు సరికాదంటూ మండిపడుతున్న వారే ఎక్కువ. పోలీసుల ముందే తాను తప్పించుకుంటానని.. ఎలాంటి కేసుల నుంచైనా బయటపడతానని ధైర్యంగా చెబుతున్నాడటంలే ఇతగాడి ధైర్యానికి ఆశ్చర్యపోవాలా.. లేక నేరస్తుడు తప్పించుకునేలా ఉన్న చట్టాల్ని చూసి బాధపడాలా..?
Tags:    

Similar News