రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ప్ర‌త్యేక‌త‌లు ఏమిటో తెలుసా?

Update: 2022-07-25 04:06 GMT
జూలై 25న సోమ‌వారం భార‌త 15వ రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న నేప‌థ్యంలో ఇక నుంచి ఆమె ఉండ‌బోయే రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ గురించి దేశ ప్ర‌జ‌ల్లో ఆసక్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్ర‌ప‌తి భవ‌న్ విశేషాల‌ను తెలుసుకోవ‌డానికి అంతా ఆస‌క్తి చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ప్ర‌త్యేక‌త‌లు ఏమిటో మీకు తెలుసా?...

రాష్ట్రపతి భవన్ న్యూ ఢిల్లీలో ఉన్న భారత రాష్ట్రపతి అధికారిక నివాసం. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ స్మారక కట్టడాలలో ఒకటిగా ఉంది. ఇందులో ఉద్యానవనాలు, మ్యూజియం, సెరిమోనియల్ హాల్, భారీ స‌మావేశాలు నిర్వ‌హించుకోవ‌డానికి వీలుగా హాళ్లు, అంగరక్షకులు, సిబ్బంది నివాసం మొదలైనవి ఉన్నాయి. అలాగే ఇది విస్తీర్ణం పరంగా దేశంలోనే అతిపెద్ద దేశాధినేత నివాసం కావ‌డం విశేషం.

1912 నుంచి 1929 మధ్యకాలంలో రాష్ట్రపతి భవన్ నిర్మించారు. అంటే దాదాపు 17ఏళ్ల పాటు నిర్మాణం సాగింది. దీనికోసం అప్పట్లోనే కోటీ 40 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు టాక్. ఇందులో మొదట లార్డ్ ఎర్విన్ వైస్రాయ్ కుటుంబం నివసించారు. స్వాతంత్య్రం తర్వాత 1950లో ఈ భవనాన్ని రాష్ట్రపతి భవన్‌గా మార్చారు.

330 ఎకరాల్లో ఇంగ్లీష్ అక్షరం H ఆకారంలో రాష్ట్రపతి భవనం నిర్మించారు. ఈ నాలుగు అంతస్థుల భవనంలో.. మొత్తం 340 గదులు ఉన్నాయ్. భవనం మొత్తం విస్తీర్ణం 2 లక్షల చదరపు అడుగులు. కారిడార్ల పొడవే రెండున్నర కిలోమీటర్లు. బిల్డింగ్ నిర్మాణం కోసం 70 కోట్ల ఇటుకలు ఉపయోగించారు. 30 లక్షల క్యూబిక్ ఫీట్ల రాళ్లు, ఇనుముతో మొత్తం 23 వేల మందికి పైగా కార్మికులు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఈ భవంతి నిర్మాణానికి సర్ ఎడ్విన్ లూటెన్స్‌, హెబెర్ట్ బకెర్ ఆర్కిటెక్ట్‌లుగా పనిచేశారు. రాష్ట్రపతి భవన్‌లో మొత్తం 64 లివింగ్ రూమ్స్ ఉన్నాయ్. మార్బల్ హాల్, కిచెన్ మ్యూజియం, చిల్డ్రెన్ గ్యాలరీ, గిఫ్ట్ మ్యూజియం, దర్బార్ హాల్, లైబ్రరీ, అశోక హాల్, మొఘల్ గార్డెన్‌లు ఈ భవనం ప్రత్యేకతలు.

బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. భారత, మొఘల్, బౌద్ధ సాంప్రదాయ నిర్మాణశైలితో, విశాలమైన గదులు, ఆహ్లాదకర ఉద్యానవనాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లతో ఎన్నో విశేషాలకు రాష్ట్రపతి భవన్ పెట్టింది పేరు.

రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి… మొఘల్ గార్డెన్స్‌. ఏటా ఫిబ్రవరి, మార్చిలో జనాల సందర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. వేల రకాల పూలమొక్కలు ఇందులో కొలువుదీరి ఉంటాయ్. ఇక రాష్ట్రపతి భవనంలోని దర్బార్‌హాల్‌లో ఏళ్లనాటి గౌతమబుద్ధుడి ప్రతిమ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుంది. రాష్ట్రపతి భవనంలో ఉన్న హాల్స్‌లో.. దర్బార్‌ హాల్‌, అశోక హాల్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ కార్యక్రమం జరిగినా.. ఈ రెండు హాల్స్‌లోనే నిర్వహిస్తారు. దర్బార్‌ హాల్‌లో 5 వందల మంది కూర్చునే అవకాశం ఉంటుంది. మొదటి ప్రధాని నెహ్రూ… ప్రమాణ స్వీకారోత్సవం ఈ హాల్‌లోనే జరిగింది.
Tags:    

Similar News