జ‌గ‌న్ నిర్ణ‌యం..తెలంగాణ జ‌ర్న‌లిస్టుల్లో తీవ్ర అసంతృప్తి!

Update: 2019-07-02 04:30 GMT
తన చేతికి ప‌వ‌ర్ వ‌చ్చింది మొద‌లు పాల‌నా ర‌థాన్ని ప‌రుగులు తీయిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్  ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తీసుకున్న ఒక నిర్ణ‌యంపై తెలంగాణ జ‌ర్న‌లిస్టులు కేసీఆర్ స‌ర్కారుపై ఆవేద‌న‌తో ర‌గిలిపోతున్నారు. క‌నీసం జ‌గ‌న్ ను చూసైనా నేర్చుకోవాలంటూ మండిప‌డుతున్నారు.

తెలంగాణ ఉద్య‌మంలోనూ.. కేసీఆర్ స‌ర్కారు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టంలో పాత్రికేయుల పాత్ర ఎంతో ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తుంటుంది. అలాంటి వారి విష‌యంలోనూ ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ త‌మ‌కేం చేయ‌లేద‌న్న అసంతృప్తి తెలంగాణ జ‌ర్న‌లిస్టుల్లో అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఏపీలోని జ‌ర్న‌లిస్టులు త‌మ పిల్ల‌ల చ‌దువుకునే స్కూళ్ల‌ల్లో ఫీజుల్ని వంద శాతం రాయితీ క‌ల్పిస్తూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే ఏపీలోని ప్ర‌తి జిల్లాలోనూ జిల్లా కలెక్ట‌ర్లు ప్ర‌త్యేకంగా ఉత్త‌ర్వులు జారీ చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యానికి అనుగుణంగా ప్రైవేటు.. కార్పొరేటు స్కూళ్లు.. కాలేజీలు జ‌ర్న‌లిస్టుల పిల్ల‌ల‌కు ఉచితంగా చ‌దువు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ‌లోనూ జ‌ర్న‌లిస్టుల పిల్ల‌ల‌కు 50 శాతం ఫీజు  రాయితీ క‌ల్పించ‌నున్న‌ట్లుగా జీవో రిలీజ్ చేసింది కేసీఆర్ స‌ర్కారు. కాకుంటే.. ఆ నిర్ణ‌యం ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్క‌డా అమ‌లు కాని ప‌రిస్థితి. మాట‌లు కోట‌లు దాటించే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన హామీ సైతం అమ‌లయ్యేలా ప్ర‌య‌త్నించ‌రా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్ప‌టికే జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల విష‌యంలో హ్యాండిచ్చిన కేసీఆర్ ఏ విష‌యంలోనూ త‌మ‌కు మేలు క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌న్న ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

తమ‌కు ఇళ్లు ఇవ్వ‌టానికి చేతులు రాని కేసీఆర్‌.. త‌మ పార్టీకి ప్ర‌తి జిల్లాలో పార్టీ ఆఫీసులు నిర్మించుకోవ‌టానికి వీలుగా భూముల్ని ఎలా కేటాయిస్తున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇళ్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. పిల్ల‌ల ఫీజుల విష‌యంలో ఏపీ సీఎం మాదిరి ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌ర‌న్న ఆగ్ర‌హం సీఎం కేసీఆర్ మీద అంత‌కంత‌కూ పెరుగుతోంది. మ‌రి.. ఈ ఉదంతంపై కేసీఆర్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. 
Tags:    

Similar News