కేసీఆర్ మనవడికి సన్మానం!!

Update: 2016-07-13 08:13 GMT
 రాజకీయ నాయకులు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో తెలియదంటారు. ఒక్కోసారి తలపండిన నేతలనే తూలనాడిపొమ్మంటారు.. ఓనమాలు నేర్పినవారినే ఓడించడానికి కంకణం కట్టుకుంటారు. ఒక్కోసారి తమ కంటే చిన్నవారిని.. ఏమాత్రం తమకు పోటీ కానివారిని కూడా చేతులెత్తి నమస్కరిస్తారు. ముఖ్యంగా ప్రముఖ రాజకీయ నేతల వారసుల విషయంలో కొందరు నేతలు బాగా ఎక్కువ చేస్తుంటారు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లోనూ ఆలాంటి ఆసక్తికర పరిణామమే జరిగింది.

ఖైరతాబాద్ టైగర్ గా పేరొందిన దివంగత నేత పి.జనార్దనరెడ్డి(పీజేఆర్) కుమారుడు - మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ణనరెడ్డి కేసీఆర్ మనవడు పన్నెండేళ్ల హిమాంశును పూలమాలతో సత్కరించారు. అవును .. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కాంగ్రెస్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణు ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ కు దూరమయ్యారు. ఆయన సోదరి టీఆరెస్ లో చేరినా విష్ణు మాత్రం టీఆరెస్ లో లేరు.  మంగళవారం తన పుట్టిన రోజు జరుపుకున్న కేసీఆర్ మనవడు - కేటీఆర్ కుమారుడు హిమాంశు జూబ్లీ హిల్సు పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు చేయగా అక్కడకు వచ్చిన విష్ణు.. హిమాంశు మెడలో పూల మాల వేసి సత్కరించారు. హిమాంశు జన్మదినం సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో ఆయన కుటుంబసభ్యులు పూజలు చేశారు. ఆ సందర్భంగా ఆ పన్నెండేళ్ల ప్రముఖుడిని విష్ణు సత్కరించడం అందరినీ ఆకట్టుకుంది.

అయితే.. జూబ్లీహిల్సు పెద్దమ్మ తల్లి ఆలయానికి విష్ణు ట్రస్టీ. అక్కడికి వచ్చే ప్రముఖులను గౌరవించడం ఆనవాయితీ. ఆ క్రమంలోనే విష్ణు ఇలా ముఖ్యమంత్రి మనవడు - మంత్రి కుమారుడు అన్న కారణంతో హిమాంశును సత్కరించాడని అంటున్నారు. కొందరు మాత్రం దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని చెబుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. హిమాంశు మాత్రం ఎంతో సీనియార్టీ ఉన్నా లీడర్లా ఆ సత్కారాన్ని అందుకోవడం అందరికీ నవ్వు తెప్పించింది.
Tags:    

Similar News