అమెరికాలో క్రికెట్ మ్యాచ్ లు.. అదీ భారత్-విండీస్ మధ్య.. పండగే

Update: 2022-08-06 11:30 GMT
వెస్టిండీస్ తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా టీమిండియా శనివారం, ఆదివారం నాలుగో, ఐదో టి20లను ఆడనుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తవగా.. వాటికి కరీబియన్ దీవులు ఆతిథ్యం ఇచ్చాయి. నాలుగో, ఐదో టి20లు మాత్రం అమెరికాలో జరుగనుండడం విశేషం. అమెరికాలో సన్ షైన్ స్టేట్ గా పేర్కొనే ఫ్లోరిడాలోని లాడర్ హిల్స్ లో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి  8 గంటలకు భారత్-వెస్టిండీస్ మధ్య నాలుగో టి20 ప్రారంభం కానుంది. సిరీస్ లో భారత్ 1, 3వ టి20లను గెలిచి 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నాలుగో టి20లో గెలుపొందితే సిరీస్ రోహిత్ సేన వశం కానుంది. ఈ మ్యాచ్ లో ఓడినా 2-2తో సమం అవుతుంది. ఆదివారం జరిగే ఐదో టి20 సిరీస్ డిసైడర్ గా మారి
మరింత మజా అందించనుంది.

అమెరికాలో అధికారిక క్రికెట్ కు 12 ఏళ్లు

అగ్ర రాజ్యం అమెరికాలో క్రికెట్ కు పెద్దగా ప్రాచుర్యం లేని సంగతి తెలిసిందే. పక్కనున్న కెనడాకు ఎప్పుడో జాతీయ జట్టు ఉన్నా.. అది ప్రపంచ కప్ లలోనూ ఆడినా అమెరికాకు మాత్రం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ జాతీయ జట్టు లేదు. బేస్ బాల్, బాస్కెట్ బాల్ అక్కడ బాగా పాతుకుపోయాయి. తక్కువ వ్యవధి మ్యాచ్ లు కావడం వీటికి కలిసొచ్చింది కూడా. ఇక క్రికెట్ సంగతి చెప్పేదేముంది? టెస్టులంటే ఐదు రోజులు.. వన్డేలంటే ఒక రోజంతా పడుతుంది. దీంతోనే అమెరికా అనే కాదు.. ఇంగ్లండ్ మినహా ఇతర పాశ్చాత్య దేశాల్లో క్రికెట్ ఎదగలేకపోయింది. కాగా, టి20లు వచ్చాక అమెరికాలో పరిస్థితి మారింది. తక్కువ సమయం తీసుకునే మ్యాచ్ లు కావడంతో అమెరికాలో పొట్టి క్రికెట్ కు ప్రాచుర్యం పెరుగుతోంది. దీనికితోడు కొన్నేళ్లుగా ఆసియా వారు ముఖ్యంగా భారత ఉప ఖండం ప్రజలు అమెరికా చేరుతుండడం, వారంతా సహజంగానే క్రికెట్ ప్రేమికులు కావడం.. తద్వారా ఆట వ్యాపితం అవుతోంది. అందుకనే టి20ల శకం ఆరంభమయ్యాక.. 12 ఏళ్ల కిందట అమెరికాలో క్రికెట్ కు మరింత బలంగా పునాదులు పడ్డాయి. 2010లో న్యూజిలాండ్, శ్రీలంక జట్లు వారాంతంలో రెండు టి20లు ఆడాయి.

అప్పట్లోనూ ఫ్లోరిడానే

12 ఏళ్ల కిందట లంక, న్యూజిలాండ్ మధ్య అమెరికాలో తొలిసారిగా జరిగిన టి20లకు ఆతిథ్యం ఇచ్చింది ఫ్లోరిడానే. అయితే, అనుకున్న స్థాయిలో ఫ్లోరిడా మాత్రం ఇప్పటికీ క్రికెట్ కేంద్రంగా ఎదగలేకపోయింది. దీనికి వేర్వేరు కారణాలున్నాయి. ఈ 12 ఏళ్లలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు 10 మాత్రమే కావడం గమనార్హం. శని, ఆదివారాల్లో జరుగబోయే వెస్టిండీస్, భారత్ మ్యాచ్ లను కలుపుకొంటే సంఖ్య 12కు పెరుగుతుంది.

ఆరేళ్ల కిందటి ఆ మ్యాచ్.. అదరహో

ఫ్లోరిడాలో క్రికెట్ మ్యాచ్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది 2016 ఆగస్టులో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన టి20నే. నాటి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ఓపెనర్ ఎవిన్ లూయీస్ (49 బంతుల్లో 100, 5 ఫోర్లు, 9 సిక్సులు) అద్భుత శతకంతో నిర్ణీత ఓవర్లలో 245 పరుగులు చేసింది. మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (33 బంతుల్లో 79, 6 ఫోర్లు, 7 సిక్సులు) కూడా రాణించాడు. అయితే, నాడు ధోనీ సారథ్యంలోని టీమిండియా కూడా అద్భుతంగా పోరాడింది. ఓపెనర్ రోహిత్ శర్మ 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు చేశాడు. కోహ్లి (9 బంతుల్లో 16) విఫలమైనా.. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 110, 12 ఫోర్లు, 5 సిక్సులు) చెలరేగి ఆడి భారత్ ను పోటీలో నిలిపాడు. కెప్టెన్ ధోనీ (25 బంతుల్లో 43, 2 ఫోర్లు, 2 సిక్సులు) చక్కటి సహకారంతో భారత్ గెలిచేలా కనిపించింది. కానీ, జిత్తులమారి బౌలర్ అయిన డ్వేన్ బ్రావో.. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా.. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనిని ఔట్ చేసి వెస్టిండీస్ ను గెలిపించాడు. దీంతో కేఎల్ రాహుల్ సెంచరీ నిరుపయోగమైంది. ఈ మ్యాచ్ లో భారత్ ఓడినా.. ఫ్లోరిడాలో క్రికెట్ కు ఊపిరిపోసింది.


ప్రపంచ కప్ ముందు చివరివివే..

నవంబరులో ఆస్ట్రేలియాలో జరుగనున్న టి20 ప్రపంచ కప్ నకు సమాయాత్తం అయ్యేందుకు రెండు జట్లకు ఇదే చివరి అవకాశం. ఇప్పటికే ఖరారైన ప్రధాన ఆటగాళ్లకు తోడుగా మిగతావారిలో ఎవరిని తీసుకోవాలో ఈ సిరీస్ తేల్చనుంది. కాగా, ఫ్లోరిడాలోని లాడర్ హిల్స్ గ్రౌండ్ చిన్నది. ఇక్కడ వైవిధ్యంగా బంతులేసే బౌలర్లకే ఎక్కువ అవకాశాలుంటాయి. భారత ఎడమ చేతివాటం పేసర్ అర్షదీప్ సింగ్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వంటివారు ఎలా ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను బోల్తాకొట్టిస్తారో చూడాలి.

వీకెండ్ లో పండుగే

అమెరికా అంటేనే ఎంజాయ్ మెంట్ కు ప్రాధాన్యం ఇచ్చే ప్రజలు. వారికి క్రికెట్ కల్చర్ అంతగా ఎక్కకపోయినా.. ఇప్పుడిప్పుడే దానిలోని మజా తెలుసుకుంటున్నారు. దీంతోపాటు వీకెండ్ లో ఆటలంటే ఇక పండుగే. దీన్నిబట్టి శని, ఆదివారాల నాటి టి20 మ్యాచ్ లకు అభిమానులు పోటెత్తుతారనడంలో సందేహం లేదు. ఈ పునాది.. అగ్రరాజ్యంలో బలమైన క్రికెట్ కల్చర్ ను పెంపొందిస్తుందని ఆశిద్దాం.. అన్నట్లు.. అమెరికా జాతీయ క్రికెట్ జట్టు ఇటీవల త్రుటిలో టి20 ప్రపంచ కప్ బెర్తును మిస్సయ్యింది. అంతేకాదు.. ఆ జట్టులో 15 మంది వరకు భారత సంతతి ఆటగాళ్లున్నారు. భారత్ కు 2012లో అండర్ 19 ప్రపంచ కప్ అందించిన కెప్టెన్, ఢిల్లీకి చెందిన ఉన్ముక్త్ చంద్ ప్రస్తుతం అమెరికాలోనే స్థిర నివాసం ఏర్పర్చుకున్నాడు. అతడు త్వరలో అమెరికా తరఫున ఆడనున్నాడని సమాచారం.
Tags:    

Similar News