జగన్ గారు.. మీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్.. వైసీపీ నాయకుల 'పిల్'

Update: 2020-08-26 17:00 GMT
సీఎం జగన్ పారదర్శక పాలనతో ముందుకెళ్తున్నారు. సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందిస్తూ సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పుతున్నారు. కానీ వైసీపీ పార్టీలో మాత్రం ముసలం తగ్గడం లేదని తాజా పరిణామాలతో తేటతెల్లమవుతోంది.

తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా కొందరు సొంత పార్టీ కార్యకర్తలే హైకోర్టుకు ఎక్కిన వైనం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం దుమారం రేపింది. మీడియాలో ఈ వార్తలు వెలుగుచూడడంతో వైసీపీ అధిష్టానానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది.

తాజాగా సత్తెనపల్లి వైసీపీ కార్యకర్తలు కొందరు నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో అక్రమమైనింగ్ కు పాల్పడుతున్నారని.. దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

అయితే హైకోర్టులో వైసీపీ కార్యకర్తలే ఈ పిటీషన్ వేశారని చెప్పడంతో న్యాయమూర్తి.. అలా ఎలా వేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని.. ఇది నిజమా కాదా అన్నది తెలుసుకోవాలని ఆదేశాలిచ్చారు.

దీంతో అంబటి రాంబాబుపై వైసీపీ నేతలే హైకోర్టుకెక్కారా? లేక ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి కొందరు వైసీపీ ముసుగులో ఈ పిటీషన్ వేశారన్నది నిగ్గు తేల్చేపనిలో ప్రభుత్వం బిజీగా ఉంది.
Tags:    

Similar News