ఇదే.. అమ‌రావ‌తిలో క‌ట్టే స‌చివాల‌య డిజైన్ ?

Update: 2017-12-01 05:48 GMT
అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే.. రానున్న రోజుల్లో ఏపీ స‌చివాల‌యంగా ఇప్పుడు చూస్తున్న డిజైన్ వాస్త‌వ రూపంలో సాక్ష్యాత్కారం కానుంది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మించే స‌చివాల‌య భ‌వ‌నం కోసం గ‌డిచిన కొద్దిరోజులుగా డిజైన్ల విష‌యంలో జ‌రుగుతున్న క‌స‌ర‌త్తు తెలిసిందే. ఇది ఒక కొలిక్కి రావ‌ట‌మే కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈ డిజైన్ ను దాదాపుగా ఫైన‌ల్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

మొత్తం మూడు ఫైన‌ల్ న‌మూనాల్ని బాబు ముందుకు తీసుకెళ్ల‌గా.. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్‌ కు చిన్న చిన్న మార్పుల‌తో ఓకే చేసిన‌ట్లుగా తెలుస్తోంది. లండ‌న్‌కు చెందిన నార్మ‌న్ ఫోస్ట‌ర్ అండ్ పార్ట‌నర్స్ సంస్థ మొత్తం మూడీ డిజైన్ల‌ను ఫైన‌ల్ చేసింది. ఇందులో రెండింటిని ప‌క్క‌న పెట్టేసి ఒక‌దాన్ని ఫైన‌ల్ చేశారు. మొత్తం మూడు డిజైన్ల‌లో మూడో దాన్ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారు.

మొద‌టి న‌మూనాకు ఎక్కువ మంది ఓకే చెప్పారు. చంద్ర‌బాబు సైతం మొద‌టి న‌మూనా ప‌ట్ల ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించి చిన్న‌చిన్న మార్పుల‌తో దాన్ని ఖ‌రారు చేసిన‌ట్లుగా స‌మాచారం. తాజాగా ఓకే చేసిన డిజైన్ ను చూస్తే..  క‌నుచూపు మేర ప‌చ్చ‌ద‌నం.. చిన్న చిన్న భ‌వ‌నాలు ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో క‌నిపిస్తుండగా.. ఐదు భ‌వ‌నాలు మాత్రం ట‌వ‌ర్స్ మాదిరి భారీగా క‌నిపించ‌నున్నాయి.

పాల‌వాగుకి ఒక ప‌క్క‌గా సీఎం కార్యాల‌య భ‌వ‌నం.. దానికి ఎదురుగా నాలుగు ట‌వ‌ర్లు.. నాలుగు మూల‌ల్లో ఉండేలా ప్లాన్ చేశారు. ఏరియ‌ల్ వ్యూలో చూస్తే.. ఐదు ట‌వ‌ర్స్ కాస్త దూరం దూరంగా క‌నిపిస్తాయి. చుట్టూ.. భారీ ప‌చ్చ‌ద‌నంతో నిండి ఉండ‌టం క‌నిపిస్తుంది. తాజాగా ఖ‌రారు చేసిన న‌మూనాను సీఆర్డీఏ వెబ్ సైట్లోనూ.. సోష‌ల్ మీడియాలోనూ.. మ‌న అమ‌రావ‌తి యాప్ లోనూ ఉంచ‌నున్నారు.

ఈ డిజైన్ లో భాగంగా సీఎం కార్యాల‌య భ‌వ‌నంలోనే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కార్యాల‌యం.. సాధార‌ణ ప‌రిపాల‌న విభాగం ఉండ‌నున్నాయి. మిగిలిన నాలుగు భ‌వ‌నాల్లో వివిధ శాఖ‌ల‌కు సంబంధించిన కార్య‌ద‌ర్శులు.. విభాగ‌ధిప‌తుల కార్యాల‌యాలు ఒకేచోట ఉండ‌నున్నాయి. ఈ భ‌వ‌నాలు 36 అంత‌స్తుల్లో ఉండ‌నున్నాయి. మిగిలిన నాలుగు భ‌వ‌నాల‌తో పోలిస్తే.. సీఎం కార్యాల‌యం ఎత్తు అధికంగా ఉండ‌నుంది. భ‌వ‌నాల న‌మూనా మొత్తం సౌక‌ర్యం.. భ‌ద్ర‌త‌.. వాస్త‌కు పెద్ద పీట వేసిన‌ట్లుగా చెబుతున్నారు. తాజా డిజైన్లో భాగంగా 40 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్ని నిర్మించ‌నున్నారు. చూసినంత‌నే ఆక‌ట్టుకునేలా ఉన్న ఏపీ స‌చివాల‌య డిజైన్‌.. వాస్త‌వ రూపంలోకి ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.


Tags:    

Similar News