ప‌న్ను ఎంత బాగా చెల్లిస్తే అన్ని ప్ర‌త్యేక వ‌స‌తులు

Update: 2019-07-05 06:44 GMT
చెల్లించేటోళ్ల‌కు.. ప‌న్ను ఎగ్గొట్టేవారికి తేడా లేదు ఈ దేశంలో?  బాధ్య‌త‌గా ప‌న్ను చెల్లించేవారిని.. ఎగ్గొట్టేవారిని ఒకే గాటున క‌ట్టేస్తారంటూ తీవ్ర‌మైన అసంతృప్తి వ్య‌క్తం చేసే వారికి ఊర‌ట క‌లిగించేలా మోడీ స‌ర్కార్ వినూత్నంగా రియాక్ట్ అవుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ దేశంలో మ‌రే ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌ని రీతిలో ప‌న్ను స‌క్ర‌మంగా చెల్లించే వారికి స‌రికొత్త ప్రోత్సహాకాల‌ను అందించేలా చ‌ర్య‌లు తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల్ని తాజాగా వెల్ల‌డించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్. తాజాగా ప్ర‌క‌టించిన ఆర్థిక స‌ర్వేలో ఈ కీల‌క విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌న్ను ఎగ‌వేత‌దారుల‌ను త‌గ్గించేందుకు వీలుగా వివిధ దేశాలు అనేక వినూత్న చ‌ర్య‌ల్ని చేప‌డుతున్నాయ‌ని.. అందులో భాగంగా తాము కూడా ప‌న్ను చెల్లింపుదారుల‌కు ప్రోత్సాహ‌కాలివ్వాల‌ని భావిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. ప‌న్ను చెల్లింపుదారుల్లో మ‌రింత స్ఫూర్తిని నింపేలా నిర్ణ‌యాల్ని వెల్ల‌డించారు.

స‌క్ర‌మంగా ప‌న్ను చెల్లించే వారికి ప్ర‌భుత్వం నుంచి మెరుగైన సేవ‌లు అంద‌టంతో పాటు సామాజికంగా ప్ర‌త్యేక గుర్తింపు.. పేరు ప్ర‌ఖ్యాతులు అందిన పక్షంలో ప‌న్నును మ‌రింత స‌క్ర‌మంగా క‌ట్టాల‌న్న మైండ్ సెట్ అంత‌కంత‌కూ పెర‌గ‌టం ఖాయం.

ఇదే అంశాన్ని తీసుకున్న మోడీ స‌ర్కార్ ప‌న్ను చెల్లింపుదారుల‌కు.. ప‌న్నును భారీగా చెల్లించే వారికి ప్ర‌త్య‌క వ‌స‌తులు క‌ల్పించ‌నున్న‌ట్లుగా పేర్కొన్నారు. ప‌న్ను సొమ్ముతోనే ప‌నులు నిర్వ‌హిస్తున్న‌ట్లుగా భారీ ప్రాజెక్టుల వ‌ద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని.. పంచాయితీ.. జిల్లాలో జ‌రిగే ప‌నుల వ‌ద్ద వీటిని ఉంచాల‌ని నిర్ణ‌యించారు. ప‌న్ను చెల్లింపుల ద్వారా ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్న భావ‌న‌తో.. తాము చెల్లించిన ప‌న్నులు స‌క్ర‌మంగా వినియోగ‌మ‌వుతున్న‌ట్లుగా భావించే వీలుంది. అత్య‌ధికంగా ప‌న్ను చెల్లించే టాప్ 10 మందిని జిల్లాల వారీగా గుర్తించి.. వారికి ప్ర‌త్యేక గుర్తింపు ఇస్తారు.

ద‌శాబ్ద కాలంలో అత్య‌ధికంగా ప‌న్నులు చెల్లించిన వారి పేర్ల‌ను ప్ర‌భుత్వం నిర్మించే ప్ర‌ముఖ భ‌వ‌నాలు.. స్మార‌క క‌ట్ట‌డాలు.. రోడ్లు.. ట్రైన్లు.. పాఠ‌శాల‌లు.. విశ్వ విద్యాల‌యాలు.. ఆసుప‌త్రులు.. ఎయిర్ పోర్టులు లాంటి వాటికి పెట్టాలి. ఎయిర్ పోర్ట్ బోర్డింగ్ పాసుల వ‌ద్ద ప్ర‌త్యేక క్యూలు ఏర్పాటు చేస్తారు.

టోల్ వ‌సూలు చేసే చోట వారికి ప్ర‌త్యేక లైనులో వెళ్లే గౌర‌వం ఇవ్వాలి. ఇమ్మిగ్రేష‌న్ కౌంట‌ర్ల‌లో వారికి ప్ర‌త్యేక దౌత్యం వంటి గౌర‌వ స‌దుపాయాలు అంద‌జేయాలి. ప‌న్నులు న్యాయ‌బ‌ద్ధంగా క‌ట్ట‌టాన్ని ప్రోత్స‌హిస్తూ.. ప‌న్నులు బాగా క‌ట్టే వారికి ప్ర‌త్యేక గౌర‌వం అందించేలా కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. ప‌లు క్ల‌బ్స్ లో ప్ర‌త్యేక స‌భ్యుడి హోదాను ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను తాజా ఆర్థిక స‌ర్వేలో పేర్కొన్నారు. ఇందులో పేర్కొన్న రీతిలో అమ‌లు చేస్తే.. దేశంలో ప‌న్ను వ‌సూళ్లు భారీగా పెర‌గ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News