వ‌ణికించిన గ్యాస్ గోదాంలో ఫైర్ యాక్సిడెంట్‌!

Update: 2017-09-15 04:48 GMT
ఒక గ్యాస్ సిలిండ‌ర్ పేలిందంటేనే గుండెలు కింద‌కు జార‌తాయి. అలాంటిది గ్యాస్ ఫిల్లింగ్ ఫ్లాంట్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంటే? ఊహించ‌టానికే వ‌ణుకు పుట్టే ఈ త‌ర‌హా ప్ర‌మాదం తాజాగా చోటు చేసుకుంది. హైద‌రాబాద్ న‌గ‌ర శివారు చ‌ర్ల‌ప‌ల్లిలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్‌) గ్యాస్ ఫిల్లింగ్ ఫ్లాంట్ లో గురువారం రాత్రి భారీ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

ప్ర‌మాద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గ్యాస్ ఫిల్లింగ్ ఫ్లాంట్ తో పాటు గోడౌన్ కూడా ప‌క్క‌నే ఉండ‌టంతో ఏం జ‌రుగుతుందో అర్థం కాని భ‌యాందోళ‌న‌లో చుట్టుప‌క్క‌ల వారున్నారు. వంద‌లాదిగా ఉన్న గ్యాస్ సిలిండ‌ర్లు ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున పేలుతూ.. గాల్లో ఎగిరిన తీరు చూపురుల‌కు షాకింగ్ గా మారాయి.

పెద్ద ఎత్తున శ‌బ్దాల‌తో పేలుతున్న గ్యాస్ సిలిండ‌ర్ల‌తో చుట్టుప‌క్క‌ల కాల‌నీవాసులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాయి. ప్ర‌మాద తీవ్ర‌త నేప‌థ్యంలో చుట్టుప‌క్క‌లున్న కాల‌నీల్లోని వంద‌లాది మందిని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న త‌ర‌లించారు. దాదాపు 15 కాల‌నీల‌కు చెందిన ప్ర‌జ‌ల్ని రాత్రివేళ‌.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో రోడ్ల మీద‌కు తీసుకొచ్చేశారు. దీంతో.. ఏం జ‌రుగుతుందో అర్థం కాక తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

55 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న హెచ్ పీసీఎల్ ఫ్లాంట్‌కు స‌మీపంలోనే ఐవోసీఎల్‌.. బీపీసీఎల్ ప్లాంట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 35 నుంచి 40 ల‌క్ష‌ల గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ఇక్క‌డ నుంచే స‌ర‌ఫ‌రా చేస్తారు. రోజుకు 14వేల నుంచి 15 వేల వ‌ర‌కు సిలిండ‌ర్ల‌ను ఫిల్ చేస్తుంటారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఫ్లాంట్ లో దాదాపు వంద‌కు పైగా కార్మికులు ప‌ని చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. అదృష్ట‌వ‌శాత్తు ఎవ‌రికి ఏం కాలేద‌ని చెబుతున్నారు.

ఊహించ‌ని రీతిలో చోటు చేసుకున్న అగ్నిప్ర‌మాదం నేప‌థ్యంలో లోప‌లికి వెళ్లేందుకు అధికారులు ఎవ‌రూ సాహించ‌లేదు. ప‌ది ఫైరింజ‌న్ల‌తో రంగంలోకి దిగిన అగ్నిమాప‌క ద‌ళం.. మంట‌ల్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే అదుపులోకి తీసుకొచ్చింది. 50 గ్యాస్ సిలిండ‌ర్లు పేలిన‌ట్లుగా కొంద‌రు చెబుతుంటే.. మ‌రికొంద‌రు మాత్రం30 సిలిండ‌ర్లుమాత్ర‌మే పేలిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌మాదానికి సంబంధించిన అధికారిక స‌మాచారం మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి చ‌ర్ల‌ప‌ల్లి వైపుగా వెళ్లే విమానాల రూట్ల‌ను మార్చారు. ఇక‌.. ట్రైన్ల‌ను సైతం పేలుళ్లు స‌మ‌యంలో తాత్కాలికంగా నిలిపివేశారు. అనంత‌రం రాక‌పోక‌లు య‌ధావిధిగా సాగాయి. ప్ర‌మాద తీవ్ర‌త మ‌రింత పెర‌గ‌కుండా ఉండే చ‌ర్య‌ల్లో భాగంగా ఆఘ‌మేఘాల మీద పైపులైన్ల స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. దీంతో.. పెను ముప్పు త‌ప్పింద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. తాజా ప్ర‌మాదం నేప‌థ్యంలో నాలుగైదు రోజుల పాటు గ్యాస్ స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News