ఇల్లు కొంటే రెండున్న‌ర ల‌క్ష‌లు ఇస్తాం

Update: 2017-02-10 16:15 GMT
కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు తీపి క‌బురు అందించింది. 2022 క‌ల్లా దేశంలో అందరికీ ఇళ్లు అన్న నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్ర‌భుత్వం గృహ రుణాలు తీసుకొనే వారిని ప్రోత్స‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఏడాదికి రూ.18 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతం ఉండి.. తొలిసారి ఓ ఇల్లు కొనే వారికి హోమ్‌ లోన్‌ లో రూ.2.4 ల‌క్ష‌ల వ‌ర‌కు భారం త‌గ్గ‌నుంది. ఇలాంటి గృహ‌రుణాల వ‌డ్డీపై కేంద్రం స‌బ్సిడీ ఇవ్వనుంది. గ‌తంలో ఈ ఏడాది జీతం నిబంధ‌న రూ.6 ల‌క్ష‌ల‌కే ప‌రిమితం కాగా.. దానిని ఇప్పుడు 18 ల‌క్ష‌ల‌కు పెంచింది. అయితే గ‌తంలో 15 ఏళ్ల ప‌రిమితి ఉన్న గృహ‌రుణాల‌పై ఈ ఆఫ‌ర్ ఉండ‌గా.. ఇప్పుడు దానిని 20 ఏళ్ల‌కు పెంచారు.

గ‌తేడాది డిసెంబ‌ర్ 31న ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద కొత్త‌గా రెండు స‌బ్సిడీ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఆ ప‌థ‌కాల వివ‌రాల‌నే ఇప్పుడు కేంద్రం వెల్ల‌డించింది. ఏడాది ఆదాయాన్ని బట్టి ఈ స‌బ్సిడీ రేట్ల‌లో తేడా ఉంటుంది. ఆరు లక్ష‌ల లోపు ఆదాయం ఉన్న‌వారికి.. వారి హోమ్‌లోన్‌లో రూ. ఆరు ల‌క్షల మొత్తానికి 6.5 శాతం వ‌డ్డీని కేంద్ర‌మే భ‌రిస్తుంది. అంటే వాళ్లు ఎంత మొత్తం లోన్ తీసుకున్నా స‌రే అందులో ఆరు ల‌క్ష‌లకు మాత్రమే 6.5 శాతం వ‌డ్డీని కేంద్రం చెల్లిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప‌ది ల‌క్ష‌ల రుణాన్ని 9 శాతం వ‌డ్డీకి గృహ‌రుణంగా తీసుకుంటే అందులో మీరు రూ.6 లక్ష‌ల మొత్తానికి 2.5 శాత‌మే వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మిగ‌తా మొత్తానికి మాత్రం 9 శాతం వ‌డ్డీ చెల్లించాలి.

ఇలాగే ఏడాదికి రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వారికి వాళ్ల మొత్తం గృహ‌రుణంలో రూ.9 ల‌క్ష‌ల‌పై 4 శాతం వ‌డ్డీని కేంద్రం స‌బ్సిడీగా ఇస్తుంది. ఇక రూ.18 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఉన్న‌వారికి మొత్తం గృహ‌రుణంలో రూ.12 ల‌క్షలకు 3 శాతం వ‌డ్డీని కేంద్ర‌మే భ‌రిస్తుంది. అంటే ఏడాదికి 9 శాతం వ‌డ్డీతో 20 ఏళ్ల ప‌రిమితికి గృహ‌రుణం తీసుకుంటే.. ఈ మూడు కేట‌గిరీల వారికి రూ.2.4 ల‌క్ష‌ల వ‌ర‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. ఇక నెల‌వారీ ఈఎంఐ కూడా సుమారు రూ.2200 వ‌ర‌కు త‌గ్గ‌నుంది. హోమ్‌లోన్స్‌పై ఉన్న ఆదాయ ప‌న్ను మిన‌హాయింపుల‌కు ఈ స‌బ్సిడీ అద‌నం. నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌, హ‌డ్కో ఈ స‌బ్సిడీ స్కీమ్స్‌కు నోడ‌ల్ ఏజెన్సీలుగా ప‌నిచేస్తాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News