పాక్ పార్లమెంట్‌ కు హిందూ మహిళ!

Update: 2018-02-13 05:01 GMT
పొరుగు దేశ‌మైన పాకిస్తాన్‌ లో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం చోటుచేసుకోనుంది. 1947లో పాకిస్థాన్ ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకు హిందూమహిళలు ఎవరూ పార్లమెంట్‌కు ఎన్నికవలేదు. ఈ రికార్డును బ్రేక్ చేస్తూ పాకిస్థాన్‌ లో తొలిసారిగా ఓ హిందూ మహిళ పార్లమెంటు సభ్యురాలు కానున్నారు. వచ్చే నెలలో ఎగువసభకు జరిగే ఎన్నికల్లో ప్రతిపక్ష పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) కృష్ణకుమారిని అభ్యర్థినిగా ప్రకటించింది. ఈమేరకు పార్టీ అధికార ప్రతినిధి నాసిర్‌ షా ఓ ప్రకటన విడుదల చేశారు.

మన రాజ్యసభ తరహాలో పరోక్ష పద్ధతిన జరిగే ఈ ఎన్నికలు మార్చ్ 3న జరుగనున్నాయి. ఈ ఎన్నిక‌కు ప్ర‌తిప‌క్ష పీపీపీ కృష్ణ‌కుమారిని బ‌రిలోకి దింపింది. కృష్ణకుమారికి ఓటువేసి గెలిపించాల్సిందిగా తమ పార్టీ ప్రజాప్రతినిధుల్ని పీపీపీ ఆదేశించింది. పాకిస్థాన్‌ లో రాజకీయ పక్షాలు సాధారణంగా ఎగువసభకు సంపన్న వర్గాలకు చెందినవారిని, ప్రముఖులను మాత్రమే నామినేట్ చేస్తుంటాయి. తనను అభ్యర్థిగా ప్రకటించడంపై కృష్ణకుమారి హర్షం వ్యక్తం చేశారు. తమది పేద కుటుంబమని - తాను చట్టసభలోకి వెళ్తానని ఊహించలేదని ఆమె చెప్పారు.
Tags:    

Similar News