ఐఫోన్ మేడిన్ ఇండియా..అయితే ఒక ట్విస్ట్‌

Update: 2018-12-28 05:34 GMT
ప్రపంచ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఆపిల్ ఐఫోన్లు భారత్‌ లోనే తయారుకాబోతున్నాయా! అవుననే అంటున్నాయి కంపెనీ వర్గాలు. వచ్చే ఏడాదిలోనే ఐఫోన్లను ఇక్కడే తయారు చేయడానికి సిద్ధమైంది సంస్థ. ఇందుకోసం కంపెనీ ఫాక్స్‌ కాన్‌ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తున్నది. తైవాన్‌ కు చెందిన ఈ స్మార్ట్‌ ఫోన్ల తయారీ సంస్థతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకొని చెన్నైలో తనకు ఉన్న ప్లాంట్లోనే ఐఫోన్లను తయారు చేయబోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌లు నిజ‌మైతే వ‌చ్చే ఏడాది మ‌న చేతుల్లో మేడిన్ ఇండియా ఐఫోన్లు ఉంటాయ‌న్న‌మాట‌!

ఐఫోన్‌ మార్కెట్లోకి ప్రవేశించి దాదాపు ప‌న్నేండేళ్లు పూర్తి కావ‌స్తోంది. జనవరి 9 - 2007న శాన్‌ ఫ్రాన్సిస్కోలో జరిగిన మ్యాక్‌ వరల్డ్ సదస్సులో ఆపిల్ మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ తొలి ఐఫోన్‌ ను ఆవిష్కరించారు. ఈ దశాబ్దకాలంలో సంస్థ వంద కోట్ల ఐఫోన్లను విక్రయించింది.  తొలి తరం ఐఫోన్‌ ను 3.5 అంగుళాల టచ్ స్క్రీన్‌ తో డిజైన్ చేశారు. మొదటి సంవత్సరంలో సంస్థ 61 లక్షల ఐఫోన్లను విక్రయించింది. 2008లో సంస్థ ఐఫోన్ 3జీని లాంచ్ చేసింది. భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన మొదటి వెర్షన్ ఇదే.త్రీజీ నెట్‌ వర్క్ - జీపీఎస్ టెక్నాలజీతో కూడిన ఈ వెర్షన్‌ ను మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి వారంలోనే పది లక్షల హ్యాండ్‌ సెట్లను విక్రయించగలిగింది.

ఇదిలాఉండ‌గా, ఇప్పటికే చాలా ఖరీదైన ఫోన్లను తయారుచేయడానికి ఫాక్స్‌ కాన్..తమిళనాడులో రూ.2,500 కోట్లతో ప్రత్యేక ప్లాంట్‌ ను ఏర్పాటు చేసింది. తద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా - పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. ఐఫోన్లు ఇక్కడే తయారు చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఫాక్స్‌ కాన్ వర్గాలు నిరాకరించాయి. అయితే, వివిధ‌ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఇక్కడే తయారు చేయ‌నుంద‌ని జాతీయ మీడియా క‌థ‌నాలు వెలువ‌రించింది.

Tags:    

Similar News