విజయవాడలో అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి. టీడీపీ తీరును ఎండగడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. రాత్రికి రాత్రి ప్రత్యక్షమైన ఈ హోర్డింగ్ లు నగరమంతా కలకలం రేపాయి. అనంతరం టీడీపీ నేతలు - మున్సిపల్ సిబ్బందితో కలిసి ఈ ఫ్లెక్సీలను తొలగించారు.
*ఫ్లెక్సీలో ఉంది ఇదే..
‘కేంద్రం ఇచ్చిన స్పెషల్ ప్యాకేజీ నిధులు తీసుకుంటూ.. యూటర్న్ తీసుకొని మళ్లీ హోదానే అడుగుతున్న టీడీపీ నేతల ఆంతర్యం ఏమిటో 5 కోట్ల ఆంధ్రులకు తెలుసులే.. పట్టిసీమ - పోలవరం ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల అవినీతి జరగడం లేదా.? తెలుగుదేశం తమ్ముళ్లూ.. ఈ ప్రాజెక్టులు - రాజధాని భూముల కేటాయింపులపై సీబీఐ విచారణ కోరుతారా.? కేంద్రం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే .. రాష్ట్ర ప్రభుత్వం పేదల దగ్గర లంచాలు వసూలు చేయడం ఎంతవరకూ కరెక్ట్.. కాల్ మనీ కేసుల విచారణ ఏమైంది.? ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలు ఎమయ్యాయి.? కులాల మద్య చిచ్చుపెట్టింది తెలుగు తమ్ముళ్లూ కాదా.?’ అని ఐదు కోట్ల మంది ఆంధ్రుల పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారన్నదానిపై క్లారిటీ లేదు. కానీ బీజేపీ నేతల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విజయవాడలో కొంతకాలంగా టీడీపీ - బీజేపీల ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. మోడీకి వ్యతిరేకంగా ఆ మధ్య టీడీపీ నేత కాట్రగడ్డ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నరేంద్రమోడీని అందులో విమర్శించారు. బీజేపీ దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. సీఎం చంద్రబాబు కూడా స్పందించి మోడీని ఎవరూ దూషించవద్దంటూ తెలుగు తమ్ముళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనమైంది.