సముద్రం చుట్టూ గోడ‌... ఇది ఏపీ సంచ‌ల‌నం

Update: 2018-12-20 10:20 GMT
సముద్రం చుట్టూ గోడ కట్టడం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. సముద్ర తీరం లో పొడవైన గోడ నిర్మాణం చేపట్టి ప్రకృతి వైపరిత్యాల నుంచి కొంతలో కొంతైనా నష్టాన్ని నివారించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం యోచన చేస్తోందని సమాచారం. సహజ వనరులకు కేరాఫ్ ఏపీ. 973 కిలోమీర్లతో దేశంలోనే రెండో(గుజరాత్ తర్వాత) అతి పొడవైన తీర ప్రాంతం కలిగున్న రాష్ట్రం. ఇదో రకంగా మనకు మైనస్ కూడా అవుతోంది. తరచూ తుఫాన్లు రాష్ట్రం మీద విరుచుకుపడుతున్నాయి. అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం మిగులుస్తున్నాయి. తీరప్రాంతంలో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సముద్రం కోతకు గురవుతోంది. ఈ క్రమంలో సమస్య పరిష్కారం పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నష్టాన్ని అడ్డుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో సముద్ర తీరంలో పొడవైన గోడ నిర్మించాలని ఆలోచిస్తోంది. దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం మన రాష్ట్రానికి ఉండగా.. ఇందులో తీవ్రమైన ప్రభావం ఉన్న 150 కిలోమీటర్ల ప్రాంతంలో పొడవైన గోడ నిర్మించాలని ప్లాన్ చేస్తోందట.

సముద్రం విరుచుకుపడకుండా గతంలో చెట్లతో హరిత బంధనం ఏర్పాటుకు ప్రయత్నించారు. చాలా చోట్ల చెట్లను వరుసగా పెంచారు. కానీ లాభం లేకపోయింది. అవి కొట్టుకుపోయాయి. అందుకే ఈ సారి చెట్లతో కాకుండా సముద్రానికి అడ్డుగా గోడ కట్టాలని నిర్ణయించామని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. దీని పై త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ఆయన చెప్పారు. రక్షిత గోడ నిర్మాణానికి సంబంధించి 2004 డిసెంబర్‌లోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు ఆయన గుర్తు చేశారు. అయితే కేంద్రం ఆ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టిందన్నారు. మరోసారి తాజాగా ప్రతిపాదనలు పంపుతామన్నారు. గోడ ఎత్తు ఎంత ఉండాలి? వెడల్పు ఎంత? ఏ ప్రాంతంలో నిర్మించాలి? అనే దాని పై చర్చలు జరుపుతామన్నారు.

మొత్తంగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలను కవర్ చేస్తూ చుట్టూ పటిష్టమైన గోడ కట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ గోడ ముఖ్య ఉద్దేశం ప్రాణ నష్టం తగ్గించడమే కాదు.. ఆస్తి నష్టం తగ్గించడం కూడా. గోడ కట్టడం అంటూ జరిగితే సముద్రం చుట్టూ గోడ కట్టిన తొలి రాష్ట్రంగా దేశ చరిత్ర లో ఏపీ మిగిలిపోతుంది. ఒక జపాన్‌ లో మాత్రమే ఇలా సముద్రం చుట్టూ గోడ కట్టారు. అక్కడ తరుచుగా సునామీలు- భూకంపాలు- తుఫాన్లు సంభవిస్తాయనే సంగతి తెలిసిందే.
Tags:    

Similar News