జగన్ సర్కార్ మీద చండ్ర నిప్పులు కురిపించిన మాజీ న్యాయమూర్తి!

Update: 2022-11-21 16:10 GMT
ఆయన న్యాయమూర్తి. రాజ్యాంగాన్ని పుక్కిట పట్టిన వారు. ఎన్నో కేసులలో తీర్పులు చెప్పిన వారు. అటువంటి ఆయన ఏకంగా ఏపీలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఉంటే అది ప్రజా ప్రభుత్వం అవుతుందా అని కూడా మరో ప్రశ్న సంధించారు. ఏపీలో రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతోందా అని మరో డౌట్ వ్యక్తం చేశారు. ఇన్ని రకాలుగా జగన్ సర్కార్ మీద మాటలతో చెడుగుడు ఆడించి పిడుగులు కురిపించిన ఆయన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ.

ఆయన తిరుపతిలో సీఐటీయూ “ప్రజా ఉద్యమాలు-నిర్బంధం”పై జరిగిన రాష్ట్ర స్త్థాయి సదస్సులో మాట్లాడుతూ పౌర హక్కులను ఏపీ ప్రభుత్వం నిలువునా  కాలరాస్తోంది అని ఘాటైన విమర్శలు చేశారు. ఏపీలో  కార్మికులు ఉద్యమాలు చేయడానికి వీలు లేకుండా ఏమిటీ నిర్బంధం అంటూ ఆయన నిగ్గదీశారు. రాజ్యాంగం ప్రకారం పౌరులు అందరికీ హక్కులు ఉన్నాయని వాటిని కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికి లేనే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ సర్కార్ మాత్రం గొంతు చేసిన వారి మీద నిర్బంధ అస్త్రం ప్రయోగిస్తూ వారిని అన్నీ విధాలుగా అడ్డుకుంటోందని ఇది మంచి విధానం కాదని ఆయన అన్నారు. కార్మికుల హక్కులను కాలరాయడానికి చూస్తే కోర్టు తలుపు తట్టాలని ఆయన సూచించారు. లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధం లేకుండా పోతుందని ఆయన అభిప్రయాపడ్డారు.

ఇక పోలీసులు చట్టాలను గౌరవించాలని, తమ పరిధికి లోబడి మసలుకోవాలని ఆయన సూచించారు.  సీఆర్పీసీ, ఐపీసీ ఉల్లంఘన ఏపీలో పోలీసులు చేస్తున్నారని, వారి మీద కోర్టులలో  కేసులు వేయాలని ఆయన కోరారు. రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులను లేకుండా  చేయడానికి పోలీసులు ఎవరని ఆయన నిలదీశారు. ఏపీలో చూస్తే పోలీసులు పాలకులకు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఆయన తప్పు పట్టారు.

ఇలా చేసిన వారు ఆ తరువాత వచ్చే ప్రభుత్వాలకు తగిన జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో పాలకుల పక్షాన ఉన్న పోలీసులు ఎక్కడ ఉన్నారో కూడా ఒకసారి చరిత్రను తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఈ దేశానికి కర్షకులు కార్మికులూ ఇద్దరూ అవసరమని, వారు పనిచేయకపోతే ఈ దేశం ఏమి కావాలని జస్టిస్ గోపాల గౌడ ప్రశ్నించారు.

కార్మికులు తన హక్కుల కోసం ఉద్యమించాలని వారిని అడ్డుకోకుండా పోలీసులు తమ బాధ్యతలను చట్ట ప్రకారం మాత్రమే నిర్వహించాలని ఈ విషయనంలో ఏపీ పోలీసులు పూర్తి స్థాయిలో మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ న్యాయమూర్తి సూచించడం విశేషం.

ఇక పోలీసుల తీరుని కోర్టుకు హెచ్చరించడం గతంలో ఎక్కడా లేదని, గత ప్రభుత్వాలలో ఈ రకమైన ధోరణి అసలు లేనే లేదని ఆయన విసమ్యం వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే గోపాల గౌడ జగన్ సర్కార్ తీరుని పోలీసుల దూకుడుని గట్టిగానే ఎండగట్టేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News