దీదీ రాజ్యంలో మాజీ మిస్ ఇండియాపై ఆక‌తాయుల వేధింపులు!

Update: 2019-06-19 07:57 GMT
అప‌ర‌కాళిగా అభివ‌ర్ణించే మ‌మ‌తాబెన‌ర్జీ రాజ్యంలో ఒక మ‌హిళ‌కు.. అందునా కోల్ క‌తా మ‌హాన‌గ‌రం న‌డిబొడ్డున కూడా ర‌క్ష‌ణ లేదా?  ఒక ప్ర‌ముఖురాలికి భ‌ద్ర‌త విష‌యంలో ఎదురైన ఇబ్బందిని పోలీసులు నిర్ల‌క్ష్యంతో వ్య‌వ‌హ‌రించారా?  ఎంత బ‌రి తెగింపు కాకుంటే.. పోలీసులు వ‌చ్చినా.. పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన కొంద‌రు ఆక‌తాయిల వ్య‌వ‌హారం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. 30 ఏళ్ల మాజీ మిస్ ఇండియా ఉషోషి సేన్ గుప్తాకు ఎదురైన చేదు అనుభ‌వం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. 2010లో లాస్ వెగాస్ లో జ‌రిగిన మిస్ యూనివ‌ర్స్ 2010లో ఐ యామ్ షి - మిస్ యూనివ‌ర్స్ ఇండియా టైటిల్ ను సేన్ గుప్తా గెలుచుకున్నారు.

త‌న‌కు ఎదురైన ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని ఆమె ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ‌ట‌మే కాదు.. అందుకు సంబంధించిన వీడియోను.. ఫోటోను పోస్ట్ చేసింది. వైర‌ల్ గా మారిన ఈ ఉదంతం చూస్తే.. ప‌శ్చిమ‌బెంగాల్ లో ఇంత దారుణ ప‌రిస్థితులు ఉన్నాయా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. ఇంత‌కీ ఉషోషి సేన్ గుప్తాకు ఎదురైన చేదు అనుభ‌వం ఏమిటి?  ఫేస్ బుక్ లో ఆమె పెట్టిన మేసేజ్ లో ఏముంది?  అనంత‌రం ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయో చూస్తే..

కోలీగ్ తో క‌లిసి ఇంటికి వెళుతున్న‌ప్పుడు కొంద‌రు నేను ప్ర‌యాణిస్తున్న ఉబ‌ర్ కారును అడ్డుకున్నారు. డ్రైవ‌ర్ తార‌క్ ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు లాగి కొట్ట‌టం మొద‌లు పెట్టారు. దీన్ని అడ్డుకున్నాను. అంతే.. నిమిషాల్లో అక్క‌డ‌కు మ‌రో ప‌దిహేనుమంది కుర్రాళ్లు తోడ‌య్యారు. వారి చేష్ట‌ల్ని ఫోన్లో రికార్డ్ చేయ‌టంతో వారు అడ్డుకున్నారు. అయినా రికార్డు చేసే ప్ర‌య‌త్నం చేసినా కుద‌ర్లేదు.  దీంతో.. ద‌గ్గ‌ర్లో ఉన్న మైదాన్ పోలీసు స్టేష‌న్  అధికారి సాయం చేయాల‌ని కోరితే.. ఈ కేసు త‌మ ప‌రిధిలోకి రాదంటూ చేతులెత్తేశారు. మీరు అలా వ‌దిలేస్తే డ్రైవ‌ర్ ను వాళ్లు చంపేస్తార‌ని గ‌ట్టిగా అర‌వ‌టంతో వారు వ‌చ్చి.. ఆక‌తాయిల్ని చెద‌ర‌గొట్టారు. అంతా అయ్యాక భ‌వానిపూర్ పోలీస్ స్టేష‌న్ నుంచి పోలీసులు వ‌చ్చారు. అప్ప‌టికి అర్థ‌రాత్రి 12 గంట‌లైంది.

మా ఇంటి ద‌గ్గ‌ర మ‌మ్మ‌ల్నిడ్రాప్ చేయాల‌ని డ్రైవ‌ర్ ను కోరా. అప్ప‌డు కూడా దుండ‌గులు వ‌ద‌ల‌కుండా ఫాలో చేశారు. మూడు బైకుల మీద వ‌చ్చిన ఆరుగురు కారును ఆపి.. నేను తీసిన వీడియోను డిలీట్ చేయాల‌ని గొడ‌వ చేశారు. కారుపైన రాళ్లు విసిరి గంద‌ర‌గోళం చేశారు. కారులో నుంచి నా బ్యాగ్ లాక్కొని.. ఫోన్ ను ప‌గ‌ల‌గొట్టాల‌ని చూశారు. చివ‌ర‌కు మా అమ్మ‌.. సోద‌రి సాయంతో పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశామ‌ని పేర్కొన్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మీకూ ఎదురుకావొచ్చ‌ని..తానుపోస్ట్ చేసిన వీడియో.. ఫోటోల్లో ఉన్న నిందితుల్ని గుర్తించాల‌ని కోరారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ ఉదంతంతో తాను చాలా షాక్ తిన్నాన‌ని.. పోలీసుల తీరు త‌న‌ను క‌లిచి వేసింద‌న్నారు.

త‌న ద‌గ్గ‌ర ఫిర్యాదు తీసుకున్న అధికారులు ఉబెర్ డ్రైవ‌ర్ ద‌గ్గ‌ర ఫిర్యాదు తీసుకోవ‌టానికి ఒప్పుకోలేద‌ని.. అదేమంటే.. ఒకే కేసుకు సంబంధించి రెండు ఫిర్యాదులు తీసుకోలేమ‌ని మాట్లాడిన‌ట్లు చెప్పారు. హెల్మెట్ లేకుండా ప‌ది మంది కుర్రాళ్లు రోడ్ల మీద హ‌ల్ చ‌ల్ చేస్తుంటే పోలీసులు ప‌ట్టించుకోక‌పోవ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

కోల్ క‌తాకు ప్రాతినిధ్యం వ‌హిస్తూ మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న త‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని తాను న‌మ్మ‌లేక‌పోతున్న‌ట్లుగా పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినా.. వేధింపుల‌కు గురి చేసే అబ్బాయిల మీద చ‌ర్య‌లు తీసుకున్న ఉదంతాలు తానెప్పుడు చూడ‌లేద‌న్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌టం.. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు ట్విట్ట‌ర్ లో రియాక్ట్ అయ్యారు. జ‌రిగిన ఘ‌ట‌న‌ను తాము తీవ్రంగా తీసుకున్నామ‌ని.. కేసు న‌మోదు చేసి ఏడుగుర్ని అరెస్ట్ చేసిన‌ట్లుగా కోల్ క‌తా పోలీసు క‌మిష‌న‌ర్ వెల్ల‌డించారు. ఏమైనా దీదీ రాజ్యంలో ఇంత ఆరాచ‌క‌మా? అంటూ ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.


Tags:    

Similar News