బీద సోదరులు: తమ్ముడు తమ్ముడే.. రాజకీయం రాజకీయమే..

Update: 2020-02-21 10:30 GMT
ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు మిత్రులయ్యారు. గతాన్ని మరచి పోయి ఇప్పుడు ఒక పార్టీలో కొనసాగుతున్నారు. ఒకప్పుడు పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో కొనసాగి.. చక్రం తిప్పిన వ్యక్తి ప్రస్తుతం అధికార పార్టీలో చేరి తన ప్రభావం చూపలేక పోతున్నారు. ఆయనే మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన సోదరుడు బీద రవిచంద్రతో కలిసి హవా కొనసాగించాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి బీద మస్తాన్ రావుకు లేదని తెలుస్తోంది. వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచి ఆయన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. టీడీపీలో తన అనుచర గణాన్ని వైఎస్సార్సీపీలోకి తీసుకు రాలేకపోతున్నారు. దీంతో ఆయన తన బలం అధికార పార్టీలో చూపించ లేకపోతున్నారు.

బీద మస్తాన్ రావు 2009లో కావలి అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేయాలని భావించగా అధినేత చంద్రబాబు ఆదేశాలతో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అనంతరం పార్టీకి దూరంగా ఉన్న ఆయన ఆ కొద్దికాలంలోనే వైఎస్సార్సీపీలో చేరారు. అయితే చేరినప్పటి నుంచి బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు ఉత్సాహంగా లేరు. ఇక్కడ ఇమడ లేకపోతున్నారో.. లేదా స్థానికంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించడం లేదా అనేది తెలియడం లేదు.

కానీ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి బీద మస్తాన్ రావు చేరికలను ప్రోత్సహించలేదు. టీడీపీలో జిల్లాలోనే బలమైన నేతగా ఉన్న అతడికి కేడర్ భారీగానే ఉంది. అయితే వారినందరినీ వైఎస్సార్సీపీలోకి తీసుకు రావడంలో విఫలమవుతున్నారు. అందుకే బీద మస్తాన్ రావుకు ప్రస్తుతం వైఎస్సార్సీపీ లో తన అనుచరులు, అభిమానులు లేరు. టీడీపీ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నా స్పందన లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన సోదరుడు బీద రవిచంద్ర అడ్డంకిగా మారారని తెలుస్తోంది. రవిచంద్ర ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సమయంలో తన సోదరుడు టీడీపీ నుంచి నాయకులను లాకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటున్నట్లు సమాచారం.

ఆ కేడర్ వెళ్లిపోతే తనకు కష్టమవుతుందని భావించిన బీద రవిచంద్ర తన సోదరుడు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నాడంట. ఒకే పార్టీలో ఉన్నాం.. కాబట్టి నడిచింది. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారడంతో రాజకీయంలో బంధాలు ఉండవని వీరిని చూస్తుంటే తెలుస్తోంది. అందుకే తమ్ముడు.. తమ్ముడే రాజకీయం.. రాజకీయమేనని అనాల్సి వస్తోంది.
Tags:    

Similar News