కేరళ సీఎంను తుపాకీతో కాల్చేస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే భార్య‌

Update: 2022-07-04 07:52 GMT
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ (70)ను జూలై 2న‌ ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. సోలార్ ప్యానెళ్ల కుంభకోణం కేసులో నిందితురాలైన మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఓ గెస్ట్‌హౌస్‌లో పీసీ జార్జ్ తనతో అసభ్యంగా ప్రవర్తించార‌ని ఆ మ‌హిళ ఫిర్యాదు చేసింది.

అలాగే పీసీ జార్జ్ తన ఫోన్‌కు అసభ్య సందేశాలు పంపించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుప‌ర్చారు. కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది.

మరోవైపు, తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణల‌ను పీజీ జార్జ్ ఖండించారు. సోలార్ ప్యానెళ్ల కుంభకోణం కేసులో ఆమెకు మద్దతుగా స్టేట్‌మెంట్ ఇవ్వలేదన్న అక్కసుతోనే ఆమె తనపై తప్పుడు ఫిర్యాదు చేస్తోంద‌ని చెబుతున్నారు. కాగా, విద్వేషపూరిత ప్రసంగం కేసులోనూ గతంలో అరెస్ట్ అయిన జార్జ్ రెండు నెలల క్రితమే బెయిలుపై విడుదలయ్యారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న భ‌ర్త‌ను అరెస్టు చేయ‌డం వెనుక కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ హ‌స్తం ఉంద‌ని పీసీ జార్జ్ భార్య ఉష తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ను తుపాకీతో కాల్చిపారేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. త‌న భ‌ర్త‌ను సీఎం త‌ప్పుడు కేసులో ఇరికించార‌ని మండిప‌డ్డారు. సీఎం విజ‌య‌న్.. త‌నను, త‌న భ‌ర్త‌ను, కుటుంబాన్ని చిత్ర‌హింస‌ల‌కు గురిచేస్తున్నార‌ని ఉష ఆరోపిస్తున్నారు. త‌న భ‌ర్త నిర్దోషి అని, సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ అవినీతిని బ‌య‌ట‌పెట్టినందుకే త‌న భ‌ర్త‌ను ల‌క్ష్యంగా చేసుకున్నార‌ని ఉష తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలో పీసీ జార్జ్ భార్య ఉష సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కేర‌ళ‌లో వైర‌ల్ గా మారాయి. ముఖ్య‌మంత్రినే తుపాకీతో కాల్చిపారేస్తాన‌ని వార్నింగ్ ఇవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. మరోవైపు కేర‌ళ పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేశారు.
Tags:    

Similar News