అందరికీ షాకిచ్చిన కాంగ్రెస్ నేత

Update: 2020-12-11 13:42 GMT
ఇది షాకుల కాలం. నేతలు తమ పార్టీలోని సహచరులకు ఏదో రూపంలో షాకులు ఇస్తునే ఉన్నారు. ఎప్పుడే నేత ఏ రూపంలో షాకిస్తారో ఎవరికీ అర్ధం కావటం లేదు. తాజాగా కాంగ్రెస్ నేతొకరు సొంతపార్టీ నేతలకే కాదు చివరకు మీడియాకు కూడా పెద్ద షాకిచ్చారు. ఎవరు ఊహించని రీతిలో ఈ సీనియర్ నేత గాంధీభవన్లో ప్రత్యక్షమవ్వటాన్ని నిజంగానే ఎవరు ఊహించలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల్లో మహేశ్వరరెడ్డి కూడా ప్రముఖులే. జిల్లాలోని నిర్మల్ నుండి ఒకసారి ఎంఎల్ఏగా గెలవటమే కాకుండా జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. మొన్నటి ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుండి కాస్త నెమ్మదైపోయారు. పార్టీ కార్యక్రమాల్లో పెద్దా యాక్టివ్ గా లేరనే అనుకుంటున్నారు.

తాజాగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ స్పీడు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. దాంతో పార్టీలో అంత యాక్టివ్ గా లేని మాజీ ఎంఎల్ఏతో కూడా కమలం నేతలు టచ్ లోకి వెళ్ళారంటూ బాగా ప్రచారం అయిపోయింది. ఈరోజో రేపో కాంగ్రెస్ కు రాజీనామా చేసేసి బీజేపీలో చేరిపోవటం ఖాయమంటు జిల్లాతో పాటు గాంధీభవన్ లో కూడా ప్రచారం పెరిగిపోయింది.

ఇటువంటి సమయంలోనే గాంధీభవన్ లో ప్రత్యక్షమైన మాజీ ఎంఎల్ఏను చూసి అందరు ఆశ్చర్యపోయారు. పార్టీకి రాజీనామా చేయటానికే వచ్చుంటారని ముందు అందరు అనుకున్నారు. అయితే పార్టీ ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ ను కలిసి పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై తన అభిప్రాయం చెబుదామని వచ్చినట్లు చెప్పేసరికి అందరు షాక్ తిన్నారు. పార్టీ మార్పుగురించి అడిగితే తాను పార్టీ మారుతున్నట్లు ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నించారు. తాను పార్టీ మారుతున్నట్లు మీరే రాసేసుకుని, మీరే ప్రచారం చేసేసి ఇపుడు తనను క్లారిటి అడిగితే ఎలాగంటూ దబాయించేటప్పటికి మీడియాకు నోటమాట రాలేదు.
Tags:    

Similar News