ప‌వ‌న్‌ తో మోత్కుప‌ల్లి భేటీ..కీల‌క ప‌రిణామం

Update: 2018-08-02 08:13 GMT
టీడీపీ మాజీ సీనియ‌ర్ నేత - తెలంగాణ‌కు చెందిన ద‌ళిత నాయ‌కుడు మోత్కుపల్లి నర్సింహులు మ‌రో సంచ‌ల‌నానికి తెర‌తీశారు. తెలుగుదేశం అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుపై విరుచుకుప‌డి బ‌హిష్కృతుడు అయిన మోత్కుప‌ల్లి అనంత‌రం త‌న విమ‌ర్శ‌ల దూకుడును మ‌రింత పెంచిన సంగ‌తి తెలిసిందే.  చంద్రబాబు అధర్మ పోరాటంపై ధర్మ పోరాటాన్ని తిరుపతి నుంచి మొదలు పెట్టానని, దీన్ని కొన‌సాగిస్తాన‌ని తిరుమ‌ల వెంక‌న్న సాక్షిగా ఆయ‌న‌ ప్ర‌క‌టించారు. దీన్ని నిజం చేస్తూ ఇటీవ‌ల చంద్ర‌బాబు తీరుపై మండిప‌డుతున్న జ‌నసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో భేటీ అయ్యేందుకు సిద్ధ‌మ‌య్యారు.ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ జనసేన కార్యాల‌యంలో ఈ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ ప‌రిణామం తెలుగు రాష్ర్టాల‌ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది.

టీడీపీ నుంచి బ‌హిష్కృతుడు అయిన మోత్కుప‌ల్లి ఇటీవ‌ల తిరుప‌తిలో ప‌ర్య‌టిస్తూ చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. ``నాకు 65 సంవత్సరాల వయస్సులో బాబు లాంటి దుర్మార్గుడిపై పోరాటం మొదలు పెట్టాను. చంద్రబాబును ఓడించాలని తిరుపతిలో మెట్టు మెట్టుకు మొక్కాను.    గాడ్సే కంటే బాబు నరహంతకుడు అని ఎన్టీఆర్ చెప్పారు`` అంటూ మోత్కుప‌ల్లి మండిప‌డ్డారు. అలా విమ‌ర్శ‌లు చేసిన మోత్కుప‌ల్లి త‌ర్వాత ఏం చేయ‌నున్నార‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొన్న స‌మ‌యంలోనే...జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సీనియర్ రాజకీయ నేత మోత్కుపల్లి భేటీ వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. పార్టీ కార్యాల‌యంలో జ‌ర‌గ‌బోయే ఈ స‌మావేశంలో మోత్కుప‌ల్లికి ప‌వ‌న్ తెలంగాణ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ‌లో పార్టీని న‌డిపించేందుకు సీనియ‌ర్లు - ఇప్ప‌టికే గుర్తింపు పొందిన నాయ‌కుల కోసం ఎదురుచూస్తున్న ప‌వ‌న్‌కు మోత్కుప‌ల్లి స‌రైన వ్య‌క్తిగా కనిపించ‌డంతో ఈ స‌మావేశం జ‌రిగిందని అంటున్నారు. కాగా, కొద్దికాలం క్రితం మోత్కుప‌ల్లి టీఆర్ ఎస్ గూటికి చేరుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఆ చేరిక‌ జ‌ర‌గ‌లేదు. దీంతో ఆయ‌న చూపు జ‌న‌సేన వైపు ప‌డింద‌ని అంటున్నారు.

కాగా, ఈ స‌మావేశం నేప‌థ్యంలో మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యతిరేక శక్తుల పునరేకీకరణ‌లో భాగంగా పవన్‌ను కలుస్తున్నాన‌ని వివ‌రించారు. రాజకీయ ఎజెండా అంటూ ఏమీ లేద‌ని, జనసేనలో చేరే అంశంపై నిర్ణయం తీసుకోలేద‌ని ఆయ‌న తెలిపారు. పవన్ ను కలసిన తర్వాత అన్ని విషయాలు తెలియపరుస్తాన‌ని మోత్కుపల్లి వెల్ల‌డించారు. జ‌న‌సేన‌లో పార్టీ బాధ్యతలపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని మోత్కుప‌ల్లి స‌మాధానం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. కాగా, మోత్కుప‌ల్లిని పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల ఇంచార్జీ లేదా తెలంగాణ ప్రాంత అధ్య‌క్షుడిగా ప‌వ‌న్ ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News